చంద్రయాన్-2 ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనాల సరసన నిలుస్తుంది భారత్. ఇప్పటివరకు ఆ దేశాల రోవర్లు మాత్రమే చందమామపై మృదువుగా ల్యాండ్ అయ్యాయి.
భారత్ 2008లోనే ప్రయోగించిన చంద్రయాన్-1కు కొనసాగింపు చంద్రయాన్-2. అయితే.. దీనికెన్నో ప్రత్యేకతలున్నాయి. అప్పటి ప్రయోగం.. కేవలం జాబిల్లి కక్ష్యకే పరిమితమై సమాచారాన్ని సేకరించి భూమికి పంపింది. చంద్రయాన్-1తో అంతరిక్ష రంగంలో భారత్ ముద్ర ఉండాలన్న బలమైన ఉద్దేశంతో చంద్రయాన్-1లో 35 కిలోల ఇంపాక్టర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి జారవిడిచింది. అది బలంగా చంద్రుడిని ఢీకొట్టింది.
చంద్రయాన్-2లోని ల్యాండర్, రోవర్ మాత్రం చంద్రుడి ఉపరితలంపైకి సున్నితంగా దిగుతాయి. ముఖ్యంగా రోవర్.. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ ప్రయోగాలు చేస్తుంది. స్వీయ పరికరాలతో.. ఫొటోలూ తీసి అక్కడి వివరాలను భూమికి పంపుతుంది. కాబట్టి చంద్రయాన్-1తో పోలిస్తే... చంద్రయాన్-2 ఎంతో క్లిష్టమైన, ప్రతిష్టాత్మక భారీ ప్రయోగం.
అందుకే ఇస్రో తగు జాగ్రత్తలు తీసుకుంది. ఏ మాత్రం పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది.
దక్షిణ ధ్రువంపై తొలిసారి...
చంద్రయాన్-2తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఇప్పటివరకు ఏ దేశమూ ఈ ఘనత సాధించలేదు. దక్షిణ ధ్రువంపై అనుకూల పరిస్థితులే.. ల్యాండ్ చేయాలనుకోవడానికి ఓ కారణం.
సౌరకుటుంబానికి సంబంధించిన ఎన్నో అంతుచిక్కని విషయాలు దక్షిణ ధ్రువంపైనే నిక్షిప్తమై ఉన్నాయని భావిస్తున్నారు. నీటి జాడ ఉంటుందని.. తద్వారా ఇక్కడ ఆవాసానికి ప్రత్యమ్నాయ మార్గాలు సృష్టించుకోవచ్చని విశ్వసిస్తున్నారు.