ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్.. పర్యావరణం పరంగా మంచి ఫలితాలనే ఇస్తోంది. దిల్లీ, ముంబయిల్లో కాలుష్యానికి కేంద్రంగా ఉన్న 10 హాట్స్పాట్లు.. లాక్డౌన్ అమలు కారణంగా గ్రీన్జోన్లుగా మారాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా... రోడ్లపైకి వాహనాలు రాకపోవడం, చాలా వరకు పరిశ్రమలు మూతపడటమే ఇందుకు కారణం.
స్వచ్ఛమైన గాలి పీలుస్తున్న రాజధాని వాసులు...
దేశ రాజధానిలో లాక్‌డౌన్‌కు ముందు కాలుష్య కేంద్రాలుగా ఉన్న 8 ప్రాంతాలు.. ఇప్పుడు గ్రీన్జోన్లుగా మారాయని వాయు నాణ్యత, వాతావరణం అంచనా, పరిశోధనా కేంద్రీయ సంస్థ(ఎస్ఏఎఫ్ఏఆర్) డైరెక్టర్ గుఫ్రాన్ బేగ్ తెలిపారు. వినోబాపురి, ఆదర్శ్ నగర్, వసుంధరా, సాహిబాబాద్, ఆశ్రమ్ రోడ్, పంజాబీ బాఘ్, ఓఖ్లా, బదర్‌పుర్ ప్రాంతాలు స్వచ్ఛ రూపు సంతరించుకున్నాయని పేర్కొన్నారు. వీటిని సూచిస్తూ.. లాక్‌డౌన్‌కు ముందు, తర్వాత వాయునాణ్యతను సూచించే మ్యాప్‌లను విడుదల చేశారు.
ముంబయిలోని వర్లి, బోరివలీ, భందుప్ ప్రాంతాలు.. మెట్రోపాలిటన్ ప్రాంతంలోని మిగతా ప్రదేశాలతో పోలిస్తే స్వచ్ఛంగా మారాయని వెల్లడించారు.
అదే కారణం...
ముంబయి, దిల్లీల్లోని ఈ కాలుష్య కేంద్రాలు.. నిరంతర వాహన రాకపోకలు, పారిశ్రామిక సంస్థల కార్యకలాపాలతో అధిక కాలుష్యాన్ని నమోదుచేసేవి. అయితే.. ప్రస్తుతం ఈ హాట్స్పాట్లలో వాయు నాణ్యతా సూచీ(ఏక్యూఐ)- 'మెరుగైన', 'సంతృప్తికరమైన' స్థాయిల్లో ఉన్నాయి.
ఏక్యూఐ, పీఎం సూచీలు నియంత్రణలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లాక్డౌన్ అమల్లో ఉన్న మార్చి 25- ఏప్రిల్ 14, లాక్‌డౌన్‌కు ముందు మార్చి 1-21 తేదీల్లో కాలుష్య కారకాల సాంద్రతను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించారు. దిల్లీ, ముంబయి, పుణె, అహ్మదాబాద్‌లలో ఈ కాలుష్య స్థాయిలను పరిశీలించారు.
పీఎం స్థాయిల్లో భారీ క్షీణత...
కాలుష్య కారకాలను సూక్ష్మ ధూళి కణాల పరిమాణం, వ్యాసం ఆధారంగా పీఎం 2.5, పీఎం 10గా వర్గీకరించి చెబుతారు. 2.5 మైక్రాన్లకన్నా తక్కువ పరిమాణంలో ఉండే కాలుష్య కారకాలను పీఎం 2.5గా, 10 మైక్రాన్లకన్నా తక్కువ పరిమాణంలో ఉండే కాలుష్య కారకాలను పీఎం 10గా వ్యవహరిస్తారు.
పీఎం 2.5 స్థాయుల్లో 46 శాతం, పీఎం 10లో 50 శాతం క్షీణత నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తాజాగా వెల్లడించింది. దిల్లీ, ముంబయిల్లో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని విశ్లేషించింది.