మహారాష్ట్ర సోలాపుర్‌లో లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న వలసకార్మికుల కోసం.. 'శ్రామిక్' రైలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గ్వాలియర్ వెళ్లేందుకు వందల మంది అందులో ఎక్కి కూర్చున్నారు. అయితే రైలు బయలుదేరే ముందు ఓ సంఘటన జరిగింది. మహిళ, 4 నెలల చిన్నారిని ఎత్తుకొని రైల్వే ట్రాక్‌పై పరిగెడుతూ కనిపించింది. వెంటనే రైలును అధికారుల అనుమతితో కొద్ది నిమిషాలు నిలిపేశాడు లోకో పైలట్. ప్రస్తుతం ఈ వీడియో వీక్షకుల మనసులను కదిలిస్తోంది. ఇంతకీ జరిగిందేంటి?
రవాణా ఇబ్బందులు...
రైలును చేరుకోడానికి సమయానికి రవాణా సదుపాయం లేక.. బిడ్డను మోసుకుంటూ రైల్వేట్రాక్‌పై నడస్తూ వచ్చింది ఓ మహిళ. దూరం నుంచే ఆమెను గమనించిన రైల్వే అధికారులు.. వెంటనే స్పందించి రైలును 10 నిమిషాలు నిలిపేశారు. ఆమె ఫ్లాట్‌ఫాం వద్దకు రాగానే.. అక్కడే ఉన్న ఓ ఫొటో జర్నలిస్ట్ పసిబిడ్డను తీసుకొని మహిళ రిజర్వ్ చేసుకున్న బోగి వరకు సాయం చేశాడు. ఇద్దరినీ రైలు ఎక్కించాడు. ఘటనా స్థలంలో ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇదంతా చూసి భావోద్వేగమయ్యారు.