సుప్రీంకోర్టులో సోమవారం ఆరు ధర్మాసనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఒక్కో ధర్మాసనం 12 అత్యవసర వ్యాజ్యాలను మాత్రమే విచారించనుంది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కోర్టులో రద్దీని తగ్గించేందుకు మొత్తం 15కు గాను 6 ధర్మాసనాలే విధుల్లో ఉంటాయని శుక్రవారమే తెలిపింది సుప్రీం. విధులకు హాజరయ్యే సిబ్బందికి స్క్రీనింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది. కేసులు వాదించే లాయర్లు మినహా కోర్టులోనికి ఇతరులకు ప్రవేశం లేదని పేర్కొంది.
సుప్రీం సోమవారం విచారణ చేపట్టబోయే వాటిలో రెండు ముఖ్యమైన పిటిషన్లు ఉన్నాయి. 2018 భీమాకొరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ నవ్లఖా ముందస్తు బెయిల్ పిటిషన్, నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పిటిషన్లు ఉన్నాయి.
గౌతమ్ నవ్‌లఖాకు మార్చి 16 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మార్చి 6న ఆదేశించింది సుప్రీం. ఈ గడువు సోమవారంతో ముగియనుండటం వల్ల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనుంది.
తనకు న్యాయపరమైన హక్కులు మళ్లీ కల్పించాలని, తన తరఫు న్యాయవాది కోర్టును తప్పుదోవ పట్టించారని నిర్భయ దోషి ముకేశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పైనా విచారణ జరపనుంది సుప్రీం ధర్మాసనం.