శబరిమల అయ్యప్పస్వామి భక్తుల శరణుఘోషతో మార్మోగుతోంది. మక్కర్విలక్కు పూజగా పిలిచే మకర జ్యోతి సందర్శన వరకు రెండు నెలల పాటు జరిగే మండల పూజ కోసం ఈనెల 16 సాయంత్రం ఆలయ గర్భగుడిని తెరిచారు.
అప్పటి నుంచే అయ్యప్పస్వామి పుణ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. ఇప్పటి వరకు 70 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తొలి రోజున సుమారు రూ.3.32 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో మహిళల ప్రవేశంపై నిరసనలు వెల్లువెత్తిన క్రమంలో ఆదాయంలో గండి పడింది. రూ.1.28 కోట్లు మాత్రమే వచ్చింది.
"ఈ ఏడాది భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. గతేడాది రూ.1.28 కోట్లతో పోల్చితే ఈసారి తొలి రోజున రూ.3.32 కోట్ల ఆదాయం సమకూరింది. సదుపాయాల పట్ల భక్తులు సంతృప్తిగా ఉన్నారు. సుమారు 40 వేల మందికి అన్నదానం ఏర్పాటు చేశాం. శబరిమలను ప్లాస్టిక్ రహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. "
- ఎన్. వాసు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు
ఇదీ చూడండి: డిసెంబర్ 1 నుంచి వొడాఫోన్-ఐడియా ఛార్జీల మోత