కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వారం రోజుల్లో అధికార పక్షానికి చెందిన మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈనెల 1న కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు(రమేశ్ జర్కిహోలీ, ఆనంద్ సింగ్) శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే... రమేశ్ రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపగా స్పీకర్ తిరస్కరించారు. నేడు... మరో 10 మందితో కలిసి రమేశ్ స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. 11 మంది రాజీనామా లేఖలు సమర్పించారు. ఈ విషయాన్ని స్పీకర్ రమేశ్ కుమార్ ధ్రువీకరించారు.
మొత్తం 12 మంది ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మెజార్టీ కోల్పోతుంది. భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
మంగళవారం వరకు హైడ్రామా...?
ఎమ్మెల్యేలు వచ్చిన కాసేపటికే స్పీకర్ రమేశ్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. గంటపాటు వేచి చూసిన శాసనసభ్యులు... స్పీకర్ కార్యదర్శికి రాజీనామా లేఖలు సమర్పించారు.
స్పీకర్ తీరు సర్వత్రా చర్చనీయాంశమవగా ఆయన వివరణ ఇచ్చారు. "నా కుమార్తె కోసం ఇంటికి వెళ్లా. రాజీనామా లేఖలు తీసుకుని, రసీదు ఇవ్వాలని కార్యాలయ సిబ్బందికి చెప్పా. 11 మంది రాజీనామా చేశారు. ఆదివారం సెలవు. సోమవారం నాకు వేరే పనులు ఉన్నాయి. మంగళవారం రాజీనామాలను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటా" అని చెప్పారు రమేశ్.
కుమారస్వామి ప్రభుత్వం కొనసాగుతుందా, కూలుతుందా అన్న విషయం శాసనసభలో తేలుతుందని అన్నారు రమేశ్.
నాటకీయ పరిణామాలు....
కర్ణాటకలో ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లారని తెలుసుకుని... కాంగ్రెస్ 'ట్రబుల్షూటర్' డీకే శివకుమార్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సర్దిచెప్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
తాజా పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
లెక్కల చిక్కులు...
కర్ణాటక శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 224. అధికారంలో ఉండాలంటే కనీసం 113 మంది సభ్యుల బలం అవసరం.
78 మంది సభ్యులున్న కాంగ్రెస్, 37 మంది ఎమ్మెల్యేలున్న జేడీఎస్, ఒక సభ్యుడున్న బీఎస్పీ, ఇద్దరు స్వతంత్రులతో కుమారస్వామి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. అధికార పక్ష బలం 118. భాజపాకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కర్ణాటక రాజకీయాలు రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. చివరకు ఎమ్మెల్యేల రాజీనామా పర్వంతో క్లైమాక్స్‌కు చేరాయి.
రాజీనామాలు ఆమోదిస్తే...
12 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే... సభలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలం 106కి తగ్గిపోతుంది.
ఎమ్మెల్యేల రాజీనామాతో సభలో మొత్తం సీట్ల సంఖ్య 212కి తగ్గుతుంది. అధికారంలో కొనసాగాలంటే కనీసం 107 మంది బలం అవసరం. అంతమంది సభ్యుల మద్దతు లేక... కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
భాజపా దూకుడు...
శాసనసభ ఎన్నికల్లో 105 సీట్లు గెలుచుకుని, అధికారం దక్కించుకునేందుకు కొద్ది అడుగుల దూరంలో ఆగిపోయింది భాజపా. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.