దేశ రాజధానిలో కరోనా వైరస్ రెండో దశ.. గరిష్ఠ స్థాయిలో ఉందని వెల్లడించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. రానున్న రోజుల్లో ఆ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెప్పినట్లు పేర్కొన్నారు.
''జులై 1 నుంచి ఆగస్టు 17 వరకు వైరస్ నియంత్రణలోనే ఉంది. ఆ తర్వాత సెప్టెంబరు 17న కొత్తగా 4,500 కరోనా కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. నిపుణులు అంచనా ప్రకారం.. దిల్లీలో సెకండ్ వేవ్ గరిష్ఠ స్థాయిలో ఉంది. రానున్న రోజుల్లో ఆ తీవ్రత తగ్గుముఖం పడుతుంది.''
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
కొవిడ్ కేసులు భారీ సంఖ్యలో నమోదైనప్పుడు కేంద్రం, ఎన్‌జీఓలు, దిల్లీ వాసుల సహకారంతో వాటిని నియంత్రించగలిగినట్లు స్పష్టం చేశారు సీఎం. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రధాని నేతృత్వంలో కొవిడ్ కట్టడికి సంబంధించి వర్చువల్ సమావేశం చాలా ఫలవంతంగా జరిగిందని తెలిపారు కేజ్రీవాల్.
దేశరాజధానిలో గురువారం 3,834 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 2.60 లక్షలు దాటింది. మరో 36 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5,123కు చేరింది.
75 శాతం ఆ రాష్ట్రాల్లోనే..
24 గంటల వ్యవధిలో నమోదైన 86 వేల 508 కొత్త కేసుల్లో.. 75 శాతం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అవి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కేరళ, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ్ బంగాలోనే నమోదైనట్లు తెలిపింది.
సిక్కిం సీఎం ఇంట్లో కరోనా కలకలం...
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ ఇంట్లో కరోనా కలకలం రేగింది. కొద్ది రోజుల కిందట ఆయన భార్య కృష్ణ సహా కుటుంబసభ్యులకు వైరస్ పాజిటివ్‌గా తేలగా.. ఇప్పుడు సీఎం కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్యకు కరోనా సోకింది.
ఆయన నివాసంలోని మరో 9 మందికి వైరస్ సోకినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.