భారత్ పర్యటనలో భాగంగా దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్. దక్షిణ దిల్లీలోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలలో సుమారు గంటపాటు విద్యార్థులతో గడిపారు మెలానియా. తరగతి ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో విద్యార్థులు ఆమెపై ప్రశ్నలు సంధించారు.
అమెరికా ఎంత పెద్దదని ఓ బాలిక అడగగా.. భారత్ నుంచి అగ్రరాజ్యం దూరమా? అని మరో బాలిక, ప్రథమ మహిళగా మీరు ఏమి చేస్తారని ఇంకో చిన్నారి ప్రశ్నించింది. వారి ప్రశ్నలకు నవ్వుతూ బదులిచ్చారు మెలానియా.
మొదటి తరగతి విద్యార్థుల కోసం పాఠశాలలో ప్రత్యేకంగా ఓ గది ఉంది. అందులో మట్టితో బొమ్మలు తయారు చేస్తున్న పిల్లలతో ఆమె సరదాగా గడిపారు ట్రంప్ సతీమణి. ఆ మట్టితో ఏమి చేస్తారని పిల్లలను అడిగారు ఆమె.
నాలుగో తరగతి విద్యార్థులకు నిర్వహించిన 'హ్యాపీనెస్ క్లాస్'ను కాసేపు వీక్షించారు మెలానియా. వారు ధ్యానం చేస్తుండగా ఆమె అసక్తిగా తిలకించారు.
ఇదీ చూడండి: భారత్-అమెరికా మధ్య 3 ఒప్పందాలు... 'వాణిజ్యం' వాయిదా