నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం వాదనలు వినింది. అనంతరం తీర్పును ఇవాళ వెలువరించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
జస్టిస్ ఆర్. భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సమయంలో వాదనలు వాడీవేడిగా సాగాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణలో విధానపరమైన లోపాలున్నాయని ముకేశ్ తరఫు న్యాయవాది అంజనా ప్రకాశ్ ఆరోపించారు. జైలులో ముకేశ్‌ను లైంగికంగా వేధించారని తెలిపారు. ఈ ఆరోపణలను కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొట్టిపారేశారు. జైలులో అతని పట్ల ప్రవర్తనను చూసి.. దారుణమైన నేరాలను పాల్పడినవారికి క్షమాభిక్ష ప్రసాదించలేరని తెలిపారు. దోషి ఆరోపిస్తున్నట్లు అతనిని ప్రత్యేక నిర్బంధంలో ఉంచలేదని స్పష్టం చేశారు.