ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేసే నియమాలను నీరుగార్చుతోన్న 2018 తీర్పును పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌ను సుమారు 18 నెలల అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 13న త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కోర్టు.
సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.
తీర్పు..
2018, మార్చి 20న ఎస్సీ ఎస్టీ చట్టంపై తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ.. వెంటనే అరెస్టు చేయకూడదని వెల్లడించింది. పలు సందర్భాలను ఉదాహరణలుగా చూపింది. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయాలంటే ప్రత్యేక నియామక అధికారుల ఆమోదం ఉండాలని పేర్కొంది. ఉద్యోగేతరుల అరెస్ట్‌కు ఎస్ఎస్పీ ఆమోదం ఉండాలని స్పష్టం చేసింది.
కోర్టు తీర్పు ఆనంతరం ఎస్సీ, ఎస్టీ సంస్థలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. అనంతరం సుప్రీం తీర్పును తటస్థం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ-2018కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: మృత్యువును ప్రేమించిన జగత్ప్రేమికుడు... మహాత్ముడు