కొన్ని రోజులనుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై పెద్ద దుమారం చెలరేగుతోంది. ఈ వివాదంలో రాహుల్‌కు భారీ ఊరట లభించింది. రాహుల్ పౌరసత్వంపై స్పష్టత వచ్చేవరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై నిషేధం విధించాలని దాఖలైన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
వ్యాజ్యంలో విచారణ అర్హమైన విషయాలేమీ లేవని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
"రాహుల్ బ్రిటిష్ పౌరుడని మీకు ఎవరు చెప్పారు? ఏదైనా సంస్థ తమకు సంబంధించిన పత్రాల్లో బ్రిటిష్ పౌరుడిగా రాసినంత మాత్రాన.. వారికి ఆ పౌరసత్వం ఉన్నట్టేనా?"
-జస్టిస్ రంజన్ గొగొయి, సీజేఐ
రాహుల్ బ్రిటిష్ పౌరసత్వంపై స్పష్టత లభించే వరకు పోటీపై నిషేధం విధించాలంటూ పిటిషనర్లు జయ్ భగవాన్ గోయల్, సీపీ త్యాగీ వ్యాజ్యం దాఖలు చేశారు. 2015 నవంబర్‌లో భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుపైనా హోంశాఖ చర్యలు తీసుకోకపోవటాన్ని ఇందులో ప్రస్తావించారు.
ఇదీ నేపథ్యం
2005-06 సమయంలో లండన్ ఆధారిత బ్యాకాప్స్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లలో రాహుల్ ఒకరని, కార్యదర్శిగానూ ఉన్నారని సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేశారు. కంపెనీ వార్షిక రిటర్నుల దాఖలులో రాహుల్ బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నారని ప్రస్తావించారు స్వామి.
స్వామి ఫిర్యాదే ఆధారంగా రాహుల్‌గాంధీ బ్రిటన్ దేశస్థుడంటూ ఇటీవల భాజపా నేతలు ఆరోపించారు. అమేఠీలో రాహుల్ నామినేషన్ దాఖలు సమయంలోనూ.. ఆయన బ్రిటిష్ పౌరుడని, ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: