రఫేల్ కేసు తీర్పును సమీక్షించాలన్న వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అదనపు ప్రమాణపత్రం సమర్పించేందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని 4 వారాల సమయం కోరింది కేంద్రం. అందుకు అంగీకరించని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం... మే 4లోగా ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణ మే 6న జరుగుతుందని స్పష్టం చేసింది.
ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై నేడు విచారణ జరగాల్సి ఉంది.
సమాచారం లేకనే..
రివ్యూ పిటిషన్లపై తమకు అధికారికంగా సమాచారం అందలేదని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు నివేదించారు.
సమీక్ష పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు వెంటనే నోటీసులు జారీచేసింది. వీటికి సమాధానం ఇచ్చేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని వేణుగోపాల్ కోరారు. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఇదీ చూడండి: నాలుగో విడతకే నలుమూలలా ఓడారు: మోదీ