నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని నివాసం నుంచి కన్నౌజ్‌లో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వాహనాల్లో బయల్దేరిన అఖిలేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ కార్యకర్తల వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన అఖిలేశ్ పోలీసుల తీరును తప్పుపట్టారు. కార్యకర్తలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతే తనను అరెస్టు చేయాలన్నారు. కాలినడకనే కన్నౌజ్‌లో నిరసనలు చేపట్టేందుకు వెళ్తామన్నారు. అనంతరం అఖిలేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వ్యాను ఎక్కించారు. పార్టీ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు.
శాంతియుతంగా నిరసనలు చేపట్టాలనుకున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు అఖిలేశ్. దిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.