అధికారంలో ఎవరు ఉన్నా... అంతే. కీలక రాజ్యాంగ చట్టబద్ధ పదవీ నియామకాల క్రమంలో పదేపదే పునరావృతమవుతున్నది సంకుచిత రాజకీయ సంతే! తాజాగా కేంద్ర నిఘా సంఘం(సీవీసీ), కేంద్ర సమాచార సంఘా(సీఐసీ)లకు సారథుల్ని మోదీ సర్కారు ఖరారు చేసిన సందర్భంలోనూ- నియామక ప్రక్రియ తప్పుల తడకగా సాగిందన్న నిరసన స్వరం దీర్ఘశ్రుతిలోనే వినిపించింది. పదవీకాలం పూర్తి అయిన దరిమిలా కేవీ చౌదరి నిష్క్రమణతో 2019 జూన్ తొమ్మిదినుంచి ఖాళీగా ఉన్న చీఫ్ విజిలెన్స్ కమిషనర్ పదవికి ప్రస్తుతం భారత రాష్ట్రపతికి కార్యదర్శిగా ఉన్న సంజయ్ కొఠారిని, మొన్న జనవరి రెండోవారంలో సుధీర్ భార్గవ పదవీ విరమణ దరిమిలా సీఐసీగా బిమల్ జుల్కాను ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఖరారు చేసింది. ఎంపిక కమిటీ సభ్యుడిగా ఉండే విపక్ష నేతకు తుది పరిశీలన జాబితాను ముందుగానే అందించాలని ప్రధాని నిర్దేశించినా ఆ పని జరగలేదన్నది తొలి అభ్యంతరం కాగా, సీవీసీ పదవికి యోగ్యులను గుర్తించే (సెర్చ్) కమిటీలోని సభ్యుడి పేరూ తుది జాబితాలో ఉండటం వివాదాస్పదమైంది.
మెజారిటీయే అంతిమం
ఎంపిక కమిటీ సభ్యుడైన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అభ్యంతరాల్ని తోసిరాజని మెజారిటీ నిర్ణయంతో కేంద్రం నియామకాలు చేపట్టగా- సర్కారు మాటే ఫైసలా అయ్యే ఈ ఎంపిక పద్ధతివల్ల నికర ప్రయోజనం ఏమిటన్న ధర్మ సందేహం తలెత్తుతోంది! నిరుడీ రోజుల్లో కేదస (సీబీఐ) కొత్త సారథిగా రిషికుమార్ శుక్లా నియామక సందర్భంలోనూ- అవినీతి కేసుల దర్యాప్తు అనుభవం ఉండాలన్న కీలక ప్రాతిపదికను విస్మరించారన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా వ్యవస్థల ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసే రుజువర్తనులు, సమర్థుల్ని ఎంపిక చేయాల్సింది పోయి, ఇతరేతర ప్రాతిపదికలదే పైచేయి అవుతుండబట్టే, చిల్లర గొడవలతో వాటి పరువు వీధినపడుతోంది. సాక్షాత్తు సుప్రీం న్యాయపాలిక జోక్యం చేసుకొని సర్దుబాట్ల సరళిని ఉద్బోధిస్తున్నా- వరసమారని రాజకీయమే రాజ్యాంగ వ్యవస్థల పాలిట రాహువు అవుతోంది!
అధికారముంటే చాలు
అవినీతే రాజనీతిగా చలామణీ కావడం మొదలైనప్పటినుంచే వ్యవస్థల పతనం జోరందుకొంది. అధికార పక్షం ఆశీస్సులుంటే చాలు, కీలక రాజ్యాంగ పదవుల్లో కుదురుకొనే వీలు- పక్షపాతానికి, తిమ్మిని బమ్మి చేయడానికే ఉపకరిస్తోందని 2012లో భాజపా కురువృద్ధుడు అడ్వాణీ వాపోయారు. యూపీఏ జమానాలో కేంద్ర ఎన్నికల సంఘం సారథ్య బాధ్యతల్ని నవీన్ చావ్లాకు కట్టబెట్టడం ఎంత వివాదగ్రస్తమైందో తెలియనిది కాదు. చావ్లా ఎన్నికల కమిషనర్ అయ్యాక ఆయన పక్షపాతపూరిత ధోరణికి కావలసినన్ని రుజువులున్నాయంటూ, నిర్వాచన్ సదన్ రహస్యాల్ని స్వామిభక్తితో చావ్లా వెలుపలికి చేరవేసిన దృష్టాంతాల్ని గుదిగుచ్చి రాష్ట్రపతికి రాసిన లేఖలో నాటి సీఈసీ గోపాలస్వామి పొందుపరచారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే- ప్రధాని నేతృత్వంలో ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖమంత్రి, లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు సభ్యులుగా గల విస్తృత కొలీజియం ఎన్నికల సంఘం ప్రధానాధికారిని నియమించాలని సూచించిన అడ్వాణీ- ‘కాగ్’ నియామకంలోనూ విపక్ష గళానికి చోటు దక్కాలని అభిలషించారు!
నిజాయతికి ప్రామాణికమేదీ
కేంద్ర నిఘా సంఘం అధిపతిగా పీజే థామస్‌ను పట్టుబట్టి ఎంపిక చేసిన మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం- ఆ నియామకాన్ని సుప్రీంకోర్టులో అడ్డగోలుగా సమర్థించుకొన్న తీరు భ్రష్ట రాజకీయాలకు మచ్చతునకగా మిగిలింది. సీవీసీ పదవికి నిష్కళంక నిజాయతీ అసలు ప్రామాణికమే కాదని వాదించింది! థామస్‌పై పామోలిన్ కేసు పెండింగులో ఉన్నందున జాబితాలోని తక్కిన ఇద్దరిలో ఎవరైనా సమ్మతమేనన్న నాటి విపక్షనేత సుష్మా స్వరాజ్ సలహాను తోసిపుచ్చిన యూపీఏ సర్కారుకు సుప్రీంకోర్టులో శృంగభంగమైంది. థామస్ పదవీచ్యుతిని శాసిస్తూ ఇచ్చిన తీర్పులో విస్పష్ట అర్హతా ప్రమాణాల్ని, ఆయా వ్యక్తులకుండాల్సిన సచ్ఛీల విలువల్ని న్యాయపాలికే ప్రస్తావించినా- వాటికీ మన్నన కొరవడింది!
నవ్వులపాలైన వ్యవస్థ
ఎన్నికల సంఘం, కేంద్ర నిఘా సంఘం, ‘కాగ్’, కేంద్ర సమాచార సంఘం, కేదస- ఇవన్నీ కీలక ప్రజాప్రయోజన వ్యవస్థలే. నిర్వాచన్ సదన్‌ను పక్కనపెడితే, తక్కినవన్నీ పాలన వ్యవస్థలో అవినీతిని మట్టగించి విశాల జనహితానికి గొడుగుపట్టేవే! వెలుపలి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టబద్ధంగా నడుచుకొనే రుజువర్తనుల సారథ్యంలో ఆయా వ్యవస్థలుంటే- నీతి మాలిన దేశాల జాబితాలో ఇండియా పేరు ఉండేదా? సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్న కేసుల్నీ ప్రభావితం చేసేలా సీబీఐ సారథిగా రంజిత్ సిన్హా లోగడ సిగ్గుమాలిన నిర్వాకం వెలగబెడితే- కేదస కామందులుగా ఇటీవల అలోక్ వర్మ, ఆస్థానాల పరస్పర హనన విన్యాసాలు- ఆ వ్యవస్థనే నగుబాటుకు గురి చేశాయి.
'లోక్‌పాల్' ఊసేదీ
కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లోని సమాచార సంఘాల్లో ఖాళీల్ని మూడు నెలల్లోగా భర్తీ చేయాలని ‘సుప్రీం’ త్రిసభ్య ధర్మాసనం మొన్న డిసెంబరులో ఆదేశించడంతో- అనేక చోట్ల అంతేవాసుల పునరావాస కేంద్రాలుగా వాటిని మార్చేసే యత్నం నిష్ఠగా జరుగుతోంది! అవినీతిపై జాగృత జనవాహిని పూరించిన సమర శంఖానికి ఫలశ్రుతిగా లోక్‌పాల్ ఆవిర్భవించి ఆరేళ్లయినా, దానికింకా ప్రాసిక్యూషన్ రెక్కలు తొడగకపోవడం నిస్పృహ రగిలిస్తోంది! ఎన్నికల కమిషనర్ల నియామకానికి ‘స్వతంత్ర యంత్రాంగా’న్ని ఏర్పాటు చేసే కీలకాంశాన్ని సుప్రీంకోర్టు 2018 అక్టోబరులో రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఏకాభిప్రాయంతోనే ఆయా వ్యవస్థలకు నియామకాలు జరపాలంటే, ఖాళీలు ఎప్పటికీ భర్తీకావేమోనన్న న్యాయపాలిక వ్యాఖ్య- దేశీయంగా ఊడలు దిగిన విష సంస్కృతినే పట్టిస్తోంది. నిర్దిష్ట శాసనాలకు లోబడి అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ దేశాల నిఘా దర్యాప్తు సంస్థలు పని చేస్తున్న తీరును పుణికి పుచ్చుకొన్నప్పుడే- దేశీయంగానూ వ్యవస్థల గౌరవం ఇనుమడిస్తుంది!
ఇదీ చదవండి: దెయ్యాల భయం.. శ్మశానవాటికలో ఉత్సవాలు!