మంచి మనసుతో వైద్య వృత్తికి మరింత వన్నె తెచ్చారు గుజరాత్‌కు చెందిన ఓ డాక్టర్. సాటి మనిషి ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు.
సూరత్‌కు చెందిన డాక్టర్ సంకేత్ కరోనా బాధితులకు నెలల తరబడి చికిత్స అందించారు. దురదుష్టవశాత్తు ఆ వైరస్ ఆయనకూ సోకింది. శ్వాససంబంధిత సమస్యతో సూరత్ లోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్నారు.. ఇంతలో అదే వార్డులో వెంటిలేటర్ పై తన పక్కన మరో వ్యక్తికి ఆక్సిజన్ అవసరమైంది. ఒక్క క్షణం వెనుకాడకుండా తన ఆక్సిజన్ తీసి ఆ వ్యక్తి ప్రాణాలు నిలిపారు ఆ వైద్యమహాశయుడు. కానీ, ఆ సాయమే ఆయన ప్రాణాలమీదకి తెచ్చింది.
ఆక్సిజన్ యంత్రం తీసేసేసరికి ప్రాణవాయువు అందక సంకేత్ ఊపిరితిత్తులు కుచించుకుపోయాయి. కేవలం 40 శాతం మాత్రమే ఊపిరి పీల్చుకోగలిగారు. ఒంట్లో సత్తువ లేకుండాపోయింది. కాళ్లు చేతులు కదపలేని దీనస్థితిలో పడ్డారు. పక్కవారి కోసం ప్రాణాలకు తెగించిన సంకేత్‌ను ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నారు వైద్యులు. ఈ సెప్టెంబర్ 22న సంకేత్‌ను విమానంలో అత్యాధునిక సదుపాయాలు గల చెన్నై ఎంజీఎం హెల్త్ కేర్‌కు చేర్చారు.
ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు సంకేత్‌ను ఈసీఎంఓ వార్డులో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం సంకేత్ 100 శాతం ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నారు. కండరాలు కదిలించగలుగుతున్నారు. ఆయన రక్త ప్రసరణ కూడా సాధారణ స్థితికి చేరిందని తెలిపారు ఎంజీఎం చైర్మన్, డాక్టర్ బాలకృష్ణన్.
'ఎంజీఎం ఆసుపత్రి.. రోగులను కాపాడడంలో నిత్యం ముందుంటుంది. సంకేత్.. తన ప్రాణాలు పణంగా పెట్టి మానవత్వాన్ని చాటారు. ఉన్నతమైన గౌరవాన్ని పొందారు. అలాంటి మనిషిని కాపాడుకోడానికి మా శక్తినంతా కూడగట్టి పోరాడాం. '
- డాక్టర్ బాలకృష్ణన్, చైర్మన్, ఎంజీఎం ఆసుపత్రి
ఇదీ చదవండి: తొలి గాడిద పాల డెయిరీ- లీటరు రూ.7వేలు మాత్రమే!