భాజపాపై పోరాటానికి మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు గుజరాత్ మాజీ సీఎం, ప్రజాశక్తి డెమోక్రటిక్ పార్టీ (పీఎస్‌డీపీ) వ్యవస్థాపకుడు శంకర్ సిన్హ్ వాఘేలా అన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన 80 ఏళ్ల వాఘేలా.. తనను మళ్లీ పార్టీలోకి రావాలంటూ అనేకమంది కార్యకర్తలు, నేతలు కోరుతున్నారంటూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గతేడాది భరూచ్ జిల్లాలోని పిరమాన్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు తనను పార్టీలో చేరాలంటూ కన్నీళ్లు పెట్టుకొని అడిగారని తెలిపారు. అంతేకాకుండా కొందరు నేతలు కూడా పట్టుబడుతున్నారన్నారు.
భాజపాతో పోరాడేందుకు ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్‌లో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్‌లో మళ్లీ చేరేందుకు తనకెలాంటి సమస్య లేదని చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
వాఘేలా ప్రకటనకు ముందు ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారంటూ చెలరేగిన ఊహాగానాలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తమ పార్టీ నేతలెవరినీ ఆయన సంప్రదించలేదని పేర్కొంది.
వాఘేలా రాజకీయ జీవితం భాజపాతోనే మొదలైంది. 1995లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు కాగా.. అప్పుడు తనకు బదులుగా కేశూభాయ్ పటేల్‌ను సీఎంగా ఎన్నుకోవడం వల్ల వాఘేలా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. భాజపా నుంచి చీలికగా ఏర్పడి కాంగ్రెస్ మద్దతుతో 1996లో సీఎం అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.
రెండేళ్ల తర్వాత శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. కొన్ని విభేదాలు రావడంతో గతేడాది జూన్‌లో ఆ పార్టీకి సైతం రాజీనామా చేసి పీఎస్‌డీపీని ఏర్పాటు చేశారు.