శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడిగా మహంత్ నృత్య గోపాల్ దాస్, ప్రధాన కార్యదర్శిగా చంపత్ రాయ్ ఎన్నికయ్యారు. ఈ రోజు దిల్లీలో జరిగిన ట్రస్ట్ సమావేశంలో సభ్యుల ఎన్నిక నిర్వహించారు. సీనియర్ న్యాయవాది కే.పరాశరన్ నివాసంలో భేటీ అయిన సభ్యులు... ప్రధాని మోదీకి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన నృపేంద్ర మిశ్రాను మందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ట్రస్ట్ కోశాధికారిగా స్వామి గోవింద్ దేవ్ గిరిని నియమించారు.
'ప్రజల అభిప్రాయాన్ని తాము గౌరవిస్తామని, వీలైనంత త్వరగా మందిర నిర్మాణం జరుగుతుందని' రామ మందిర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ వ్యాఖ్యానించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మరింత వేగిరం చేయడమే లక్ష్యంగా భేటీ అయిన సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మందిర నిర్మాణానికి విరాళాల కోసం బ్యాంకు ఖాతాను తెరవనున్నట్లు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, హోంశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేష్ కుమార్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి అవినాశ్ అవాస్తీ, అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా సహా పలువురు హాజరయ్యారు.
ట్రస్టు విశేషాలు
గతేడాది నవంబర్ 9 తేదిన అయోధ్య తీర్పులో భాగంగా రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం..'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు'ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్‌లో 15 మంది సభ్యులను నియమించింది. సీనియర్ న్యాయవాది పరాశరన్ ఈ ట్రస్టుకు నేతృత్వం వహిస్తున్నారు.