ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రజలకు స్పష్టం చేయాలని విపక్ష కూటమికి సవాల్ విసిరారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పరిస్థితులను గమినిస్తే భాజపా విజయం తథ్యమని దిల్లీలో ధీమా వ్యక్తం చేశారు.
"2014తో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుంది. ఎన్డీఏకి మూడింట రెండొంతుల మెజారిటీ ఎక్కడికీ పోదు. 2014లో ప్రధానిపై నమ్మకం ఉండేది. ఇప్పుడది భరోసాగా మారింది.
గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ వర్సెస్ సోనియా గాంధీ. ఈసారీ మోదీ ఉన్నారు. ఆ వైపు ఎవరు? ప్రజలతో దాగుడు మూతలు ఆడొద్దు. మీ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పేయాలి."
-రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి
ఎస్పీ, బీఎస్పీ కూటమి నేతలకు మొదట ఉన్న నమ్మకం ఇప్పుడు లేదని ఎద్దేవా చేశారు రాజ్నాథ్. "కాషాయ తీవ్రవాదం" అంటూ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఇలాంటి విషయాల్లో అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరముందన్నారు.
మోదీ ప్రభుత్వం మూడు అంశాల్లో విజయం సాధించిందని తెలిపారు రాజ్నాథ్. అంత్యోదయ, అభివృద్ధి, భద్రత రంగాల్లో పురోగతి సాధించామన్నారు.
ఇదీ చూడండి: మోదీ వివాహ బంధంపై మాయ తీవ్ర వ్యాఖ్యలు