ముంబయి నగరం ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. దానికి తోడు భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమై.. ట్రాఫిక్ జామ్ అవుతోంది. చెట్లు, విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయి. ముంబయితో పాటు, రాయ్‌గఢ్, ఠాణె, రత్నగిరి, సింధ్‌దుర్గ్, నాసిక్ జిల్లాల్లో ఆదివారం ఎల్లో అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. పాల్ఘర్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ముంబయి, కొంకణ్, ఠాణెల్లో 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శాంతాక్రూజ్‌లో అత్యధికంగా 200.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబయిలోని కోలాబాలో 129.6 మి.మీ. వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని స్థానిక వాతావరణ విభాగం హెచ్చరించింది.
కుండపోత వర్షాలకు రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. జనజీవనం స్తంభించింది.
"ముంబయి, నవీ ముంబయి, ఠాణే జిల్లాల్లో.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఠాణేలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 200 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. "
-కే షోసలికర్, భారత వాతావరణ శాఖ డీజీ
- ఎల్లో వార్నింగ్ - ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకుంటూ.. జాగ్రత్తగా ఉండాలి.
- ఆరెంజ్ అలర్జ్ - అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి.
- రెడ్ అలర్ట్ - చర్యలు ప్రారంభించాలి.
ఇదీ చదవండి: రాజ్‌భవన్‌లో కరోనా కలకలం.. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటన!