సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘూ సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతులకు టాటూ ఆర్టిస్టులు మద్దతు తెలిపారు. పంజాబ్ నుంచి వచ్చిన వీరంతా అక్కడ ఒక స్టాల్‌ను నెలకొల్పారు. ఆందోళనలో పాల్గొంటున్న కర్షకులకు పచ్చబొట్లు పొడుస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. నిరసనలను ఎప్పటికీ గుర్తుంచుకునేందుకు వీలుగా అలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునే వరకు అక్కడే అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉంటామని స్పష్టం చేశారు.
"మాది లూథియానా. మేము రైతులను ప్రోత్సహించడానికి.. మద్దతు తెలుపటానికి ఇక్కడికి వచ్చాం. మా దగ్గర సింహం, ట్రాక్టర్, పంటలు, రైతులు, పంజాబ్ మ్యాప్.. ఇలా 30 వరకు టాటూలు కర్షకులకు వేస్తున్నాం. వీటి ధర రూ.3,500-రూ.5000 వరకు ఉంటుంది.. కానీ, అన్నదాతలకు ఉచితంగా పచ్చబొట్లు పొడుస్తున్నాం. యువతతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మేము చేసే ఈ పని ద్వారా ఎక్కువ మంది యువత ఆందోళనలో పాల్గొంటారు. అందుకే వీరికి మద్దతు ప్రకటించాం. సామాజిక మాధ్యమాల్లోనూ సందేశాలు పంపిస్తున్నాం."
- రవీంద్ర సింగ్, టాటూ ఆర్టిస్ట్.
"రైతులకు మద్దతు ప్రకటించడం మా విధిగా భావించాం. ప్రతి ఒక్కరూ వారిని ప్రోత్సహిస్తున్నారు. మా వంతుగా మేమిలా తోడ్పాటు అందిస్తున్నాం" అని చేతన్ సూద్ అనే టాటూ ఆర్టిస్ట్ పేర్కొన్నారు.
కొన్ని రోజులుగా నిరసనలో పాల్గొంటున్న హర్విందర్ సింగ్ అనే వ్యక్తి తన చేతిపై పంజాబ్ మ్యాప్‌ను పచ్చబొట్టు పొడిపించుకున్నారు. భారతదేశం అంటే ఇష్టమున్నప్పటికీ.. పుట్టిన ప్రాంతం కావడంతోనే ఈ టాటూ వేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: రైతులకు మద్దతుగా దిల్లీ సరిహద్దులో 'సెలూన్'