కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో రైతులను అవమానిస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. భాజపా నేతలు జాతీయవాదాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవడంపై ఉత్తరప్రదేశ్ అమేఠీలోని బరాయిచ్ ఎన్నికల ర్యాలీ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశమంటే ప్రజలని అసలైన జాతీయవాదమంటే వారి సమస్యల్ని పట్టించుకోవడమేనని అన్నారు ప్రియాంక.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా అందించే రూ. 6వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందించబోయే న్యాయ్ నెల మొత్తానికి సమానమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నామని ఉద్ఘాటించారు. భాజపా రాజ్యాంగానికి నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తోందని, వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు.