విస్తరణవాదం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడి భారత్ పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎర్రకోట వేదికగా ప్రసంగించిన మోదీ.. భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచం అండగా నిలబడడమే మన నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు.
దేశ సరిహద్దులను దాటే ప్రయత్నం చేసే ఎవరికైనా ఒక్కటే సమాధానం చెబుతామని తేల్చిచెప్పారు మోదీ. సరిహద్దులు దాటేవారికి సైన్యం తగిన గుణపాఠం నేర్పిందని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే లద్దాఖ్‌లో జరిగిన గుణపాఠమే ఎదురవుతుందని హెచ్చరించారు.
"సరిహద్దులు దాటేవారికి మన సైన్యం తగిన గుణపాఠం నేర్పింది. దేశ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తే లద్దాఖ్‌లో జరిగిన గుణపాఠమే ఎదురవుతుంది. లద్దాఖ్‌లో ఏం జరిగిందో ప్రపంచం చూసింది. విస్తరణవాదం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడి భారత్ పోరాటం చేస్తోంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
స్నేహ హస్తం
పొరుగుదేశాలతో భారత్ సుహృద్భావ సంబంధాలనే కోరుకుంటుందని స్పష్టం చేశారు. దక్షిణాసియా దేశాలకు స్నేహ హస్తం అందిస్తున్నట్లు చెప్పారు.
"బలమైన భారత నిర్మాణమే మన ముందున్న కర్తవ్యం. పొరుగు దేశాలతో భారత్ నిరంతరం సుహృద్భావ సంబంధాలనే కోరుకుంటోంది. పరస్పర విశ్వాసం, గౌరవంతోనే సంబంధాలు ఉండాలని కోరుకుంటోంది. భూమి, సముద్ర సరిహద్దులు కలిగిన అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను ఆకాంక్షిస్తుంది. సుహృద్భావ సంబంధాల కోసం దక్షిణాసియాలోని దేశాలు, రాజ్యాధినేతలందరినీ స్నేహ హస్తం అందిస్తున్నాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సరిహద్దు ప్రాంతాల్లో ఎన్సీసీని విస్తరిస్తున్నట్లు తెలిపారు మోదీ. లక్ష మంది ఎన్సీసీ క్యాడెట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి- 'నవ భారతం కోసం 100 లక్షల కోట్లతో మౌలిక వసతులు'