తమిళనాడులో 59 ఏళ్ల అర్చకుడు కరాటే, సిలంబం వంటి యుద్ధకళలను సాధన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కళలను నేర్చుకుంటూ మనిషి తలచుకుంటే ఏ వయసులోనైనా సాధించొచ్చని నిరూపిస్తున్నారు.
చెన్నై వసంత్ నగర్‌కు చెందిన శేషాద్రి.. స్థానిక అష్టలక్ష్మీ ఆలయంలో 1990 నుంచి పూజారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శేషాద్రికి బాల్యం నుంచే యుద్ధ కళలపై మక్కువ ఎక్కువ. పాత ఎంజీఆర్ సినిమాల్లో జానపద సిలంబం(కర్రసాము) కళను చూసి, ఎలాగైనా నేర్చుకోవాలని చాలా సార్లు ప్రయత్నించారు. కానీ, పూజలు పునస్కారాలు చేసుకోవాల్సిన మనం యుద్ధకళలు నేర్చుకోవడం ఏంటని ససేమిరా అన్నారు తల్లిదండ్రులు.
బ్రూస్లీని చూసి..
ఎవరెన్ని చెప్పినా శేషాద్రికి యుద్ధకళలు నేర్చుకోవాలన్న తపన ఇసుమంతైనా తగ్గలేదు. పెళ్లయ్యాక ఆయనకు స్వతంత్రం దొరికినట్టయింది. తనకు నచ్చిన సిలంబం కళను నేర్చుకోవడం మొదలెట్టారు. కొన్నేళ్లకు బ్రూస్లీ యాక్షన్ సినిమాలు చూసి కరాటే వైపు మనసు మళ్లింది. అందులోనూ ప్రావీణ్యం సాధించాలనుకుని శిక్షణ తీసుకున్నారు.
అతి తక్కువ సమయంలోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు శేషాద్రి. వార్తాపత్రికల ద్వారా ఈ విషయం తెలుసుకున్న శేషాద్రి తండ్రి సంతోషంగా కుమారుడిని మెచ్చుకున్నారు. ఇంకేముంది, శేషాద్రికి మరిన్ని యుద్ధ కళలు నేర్చుకోవాలనిపించింది. వయసును లెక్క చేయకుండా తనకు నచ్చిన మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
"అరవై ఏళ్లకు చేరువవుతున్నా.. నేను ఎన్నో యుద్ధ కళలు నేర్చుకోవాలనుకుంటున్నాను. కత్తి సాము, కర్రసాము సహా కరాటే వంటి యుద్ధ కళల్లో మెళకువలు నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ కరోనా పరిస్థితి కాస్త సద్దుమణిగాక నా పూర్తి దృష్టి శిక్షణపైనే పెడతాను. నేర్చుకోవడానికి వయసుతో పనేముంది? బాల్యంలో తల్లిదండ్రుల సహకారం లేకపోతే పెళ్లయ్యాకైనా, ఏ వయసులోనైనా మనకు నచ్చింది నేర్చుకోవాలి."
-శేషాద్రి
ఇదీ చదవండి: పాతికేళ్లు చెత్త ఏరి.. తనకు తానే విగ్రహం కట్టుకొని..