జమ్ము కశ్మీర్లో దాడులకు పాల్పడాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. నలుగురు ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేశాయి. ఆరు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి.
ఓ ఆలయంపై దాడి చేయాలని ఉగ్రవాదులు ప్రణాళికలు వేసుకున్నారని పూంచ్ సీనియర్ ఎస్పీ రమేశ్ కుమార్ అంగ్రాల్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే ఈ దుశ్చర్యకు పథక రచన చేశారని వెల్లడించారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ), రాష్ట్రీయ రైఫిల్స్, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో వీరు పట్టుబడ్డారని చెప్పారు.
"శనివారం రాత్రి ఎనిమిది గంటలకు వాహనం తనిఖీ చేస్తుండగా ముస్తఫా ఇక్బాల్, ముర్తాజా ఇక్బాల్ అనే సోదరులిద్దరిని పట్టుకున్నాం. రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లో విచారణ నిర్వహించాం. ముస్తఫాకు పాకిస్థాన్ నెంబర్ నుంచి ఫోన్లు వచ్చాయి. అతడ్ని ప్రశ్నించగా... అరి గ్రామంలోని మందిరంపై గ్రెనేడ్లు వేసేందుకే వచ్చినట్లు ఒప్పుకున్నాడు. గ్రెనేడ్లు ఎలా విసరాలనే వీడియోలు అతని ఫోన్లో దొరికాయి."
-రమేశ్ కుమార్ అంగ్రాల్, పూంచ్ సీనియర్ ఎస్పీ
అనంతరం, ముస్తఫా ఇంటిలో తనిఖీ చేయగా.. ఆరు గ్రెనేడ్లు దొరికాయని అంగ్రాల్ తెలిపారు. 'జమ్ము కశ్మీర్ ఘాజ్నవి' దళాలకు చెందిన గుర్తుతెలియని పోస్టర్లు లభ్యమైనట్లు చెప్పారు. మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను నియంత్రణ రేఖ వెంబడి ఉన్న బాలాకోట్ సెక్టార్లో పట్టుకున్నట్లు వెల్లడించారు.
మరికొంత మంది ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని, దళాల నుంచి మరింత సమాచారం అందాల్సి ఉందని చెప్పారు అంగ్రాల్.