దిల్లీలో జరిగిన అల్లర్లకు కారకులైనవారికి ఉచ్చు బిగుస్తోంది. ఓ వైపు ఎర్రకోట ఘటనపై దిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మరోవైపు ర్యాలీ నిబంధనలు పాటించనందుకు రైతు సంఘాల నాయకులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
దిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసపై ఐపీసీ సెక్షన్ 124(ఏ)కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ఘటనపై నటుడు దీప్ సిద్ధూ, లఖా సిదానాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలో వందలాది మంది రైతులు పాలుపంచుకున్నారు. పోలీసులతో తలపడి ట్రాక్టర్లతో జాతీయ స్మారక భవనమైన ఎర్రకోటలోకి ప్రవేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేసిన కోట గుమ్మాలపై ఇతర జెండాలు ఎగురవేశారు.
నిబంధనలు పాటించనందుకే..
ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్లపై రైతు సంఘాల నాయకులు యోగేంద్ర యాదవ్, భల్బీర్ సింగ్ రాజ్వేల్లతో సహా మరో 20 మందికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీకి నిర్దేషించుకున్న నిబంధనలు పాటించనందుకు చట్టపరమైన చర్యలెందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. మూడు రోజుల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని కోరినట్లు పోలీసు ఉన్నత వర్గాలు వెల్లడించాయి.
రైతు సంఘాల నాయకులు అల్లర్లలో పాల్గొన్నారని దిల్లీ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ బుధవారం ఆరోపించారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద విధ్వంసం దేశ వ్యతిరేక చర్య" అని పేర్కొంటూ పోలీసులు మరో రైతు నాయకుడు దర్శన్ పాల్‌కు ఇప్పటికే నోటీసు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన రైతు సంఘాల నాయకులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పాస్‌పోర్ట్‌లను అప్పజెప్పవలసిందిగా ఆదేశించారు.
ఇదీ చదవండి:దీప్ సిద్ధూ ఆచూకీ గల్లంతు!