ఉత్తర్‌ప్రదేశ్‌లో పౌరచట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని సమాచారం. నిరసనలు పెరగకుండా అంతర్జాల సేవలను నిలిపేశారు అధికారులు.
ఇదీ జరిగింది..
భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు యత్నించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులే లక్ష్యంగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారని అధికార వర్గాలు వెల్లడించాయి. పోలీసు చర్యతో వెనుతిరిగిన నిరసనకారులు.. ఈద్గా మార్గంలో గత మూడు వారాలుగా ఆందోళనలు చేపడుతున్న మహిళలతో చేరారని సమాచారం.
అదే సమయంలో కొత్వాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అప్పర్ కోట్ ప్రాంతంలో ధర్నా చేస్తున్న నిరసనకారులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా రాళ్లు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారని తెలుస్తోంది.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: సస్పెన్స్‌కు తెర- డొనాల్డ్ అక్కడకు వెళ్తారట