జమ్ముకశ్మీర్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా ఉగ్రసంస్థ ఉగ్రనేత హతమయ్యాడు. భారత సైన్యానికి చెందిన కల్నల్, మేజర్ సహా మొత్తం ఐదుగురు అమరులయ్యారు.
కుప్వారా జిల్లా హంద్వారాలో పౌరుల్ని బందీలుగా ఉంచారన్న సమాచారం మేరకు శనివారం రక్షణ చర్యలు చేపట్టిన భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అనేక గంటలపాటు సాగిన ఈ ఎన్కౌంటర్లో 21 రాష్ట్రీయ రైఫిల్ విభాగం కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సూద్, మరో ఇద్దరు జవాన్లు, జమ్ముకశ్మీర్ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ వీరమరణం పొందారు.
అమరులయ్యే ముందు కల్నల్ నేతృత్వంలోని బృందం.. ఉగ్రవాదుల చెర నుంచి పౌరుల్ని రక్షించింది. ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టింది. ఇందులో కరుడుగట్టిన పాక్ ఉగ్రసంస్థ లష్కరే తొయిబా టాప్ కమాండర్ హైదర్ ఉన్నాడు. మరొకరి గురించి తెలియాల్సి ఉంది.
శౌర్యానికి మారుపేరు శర్మ..
ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో అమరులైన కల్నల్ అశుతోష్ శర్మ గతంలో ఎన్నో ఉగ్రనిరోధక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు సేన పురస్కారాన్ని ప్రదానం చేసింది.
మీ త్యాగం చిరస్మరణీయం..
సాధారణ పౌరుల్ని రక్షిస్తూ ప్రాణాలు కోల్పోయిన కల్నల్, మేజర్ సహా సైనికుల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలు మరువలేనివని ట్వీట్ చేశారు.
''అమరులైన సైనికులు, భద్రతా సిబ్బంది త్యాగం మరువలేనది. దేశరక్షణ కోసం ఎంతో నిబద్ధతతో సేవచేశారు. మనపౌరుల్ని రక్షించడం కోసం అవిరళ కృషి చేశారు. వారి కుటుంబసభ్యులు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వారి అసమాన ధైర్యసాహసాలను దేశం మరిచిపోదని ట్వీట్ చేశారు.
దేశం కోసం అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణె.. ప్రాణాలు కోల్పోయిన వీరులకు నివాళులర్పించారు.