నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నేడు కోల్‌కతాలో జరిగే 'పరాక్రమ్ దివస్' వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడికి నివాళిగా ప్రతి ఏటా జనవరి 23ను 'పరాక్రమ్ దివస్'గా జరపాలని కేంద్రం నిర్ణయించింది.
వివిధ కార్యక్రమాలు..
కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో జరిగే 'పరాక్రమ్ దివస్' ప్రారంభ వేడుకలకు మోదీ అధ్యక్షత వహించనున్నారు. సుభాష్ చంద్ర బోస్ జీవిత చరిత్రపై ప్రదర్శన, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ఆయన ప్రారంభిస్తారు. అలాగే స్మారక నాణాన్ని, తపాలా బిళ్ళను విడుదల చేయనున్నారు. ఇక ఈ వేడుకల్లో బంగాలీ సాంస్కృతిక కార్యక్రమం 'అమ్రా నూతన్ జౌబొనెరి డూట్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ కార్యక్రమానికి ముందు కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీని సందర్శించనున్నారు మోదీ. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వెలువడిన 21వ శతాబ్దపు వారసత్వ పత్రాలను పరిశీలిస్తారు. అనంతరం కళాకారులతో సంభాషిస్తారని పీఎంఓ తెలిపింది.
అసోంలో..
బంగాల్ పర్యటన అనంతరం అసోంలో 1.06 లక్షల మంది లబ్ధిదారులకు భూ పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. భూ హక్కుల పరిరక్షణకు సమగ్ర నూతన భూ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అసోంలో 2016 వరకు 5.75 లక్షల కుటుంబాలకు సొంత భూమి లేదు. ఇప్పటివరకూ 2.28 లక్షల భూమి పట్టాలను ప్రస్తుత ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఈ రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్-మే నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి 'మిస్టరీ'- మోదీ, దీదీ మధ్యలో 'నేతాజీ'