దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షించారు. దాదాపు 54 వేల కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలను పరిశీలించారు. ఈ మేరకు బుధవారం జరిగిన 35వ 'ప్రగతి' సమావేశానికి అధ్యక్షత వహించారు.
ప్రగతి సమావేశంలో భాగంగా 15 రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు మోదీ. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆటంకం కలిగించే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రైల్వే, రోడ్డు-రవాణా, పరిశ్రమలు, విద్యుత్ , విదేశాంగ శాఖకు చెందిన ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని చర్చించారు.
కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్టాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. తెలంగాణలో సంగారెడ్డి-అంకోలా-నాందేడ్ జాతీయ రహదారి సెక్షన్ పనుల పురోగతి బాగుందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనరిక్ మందుల వినియోగంపై సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. కడప-బెంగుళూరు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ పనుల పురోగతిని సీఎస్ ఆదిత్యానాథ్ దాస్‌ను అడిగి తెలుసుకున్నారు. రైల్వే లైన్‌కు ఆటంకంగా ఉన్న 'ఫారెస్ట్ క్లియరెన్స్'.. సత్వరమే జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.