రాజ్‌పథ్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన హస్తకళా ప్రదర్శన 'హునర్ హాట్'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకస్మికంగా సందర్శించారు. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆ ప్రాంతానికి చేరుకొని కళాకారులతో ముచ్చటించారు.
దాదాపు 50 నిమిషాల పాటు అక్కడే గడిపిన మోదీ... బిహార్, ఝార్ఖండ్లలో ప్రఖ్యాతిగాంచిన 'లిట్టి ఛోఖా' అనే ఆహార పదార్థాన్ని ఆరగించి.. దీనికోసం రూ.120 చెల్లించారు.
అనంతరం మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి 'కుల్హాద్' టీ సేవించారు. రెండు కప్పుల కోసం రూ.40 చెల్లించారు. ప్రధాని రాకతో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్లారు.
ఏంటీ హునార్ హాట్?
విభిన్న సంస్కృతుల మేళవింపుతో హస్తకళలకు ఆపన్న హస్తం అందించేలా హునర్ హాట్ మేళాను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సాధికారత కోసం తయారు చేసే హస్తకళల విక్రయానికి ఏటా ఈ మేళాను ప్రధాన పట్టణాల్లో నిర్వహిస్తోంది కేంద్ర మైనారిటీ శాఖ. ఇప్పుడు దేశ రాజధానిలో ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసింది.