కరోనా పరిస్థితుల నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పీఎం కేర్స్ నిధిని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టు ద్వారా భారీగా విరాళాలను సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్చి 27, 2020న ప్రారంభమైన ఈ నిధికి కేవలం ఐదు రోజుల్లోనే రూ.3076.62 కోట్లు వచ్చినట్లు ఈ మధ్యే విడుదల చేసిన ఆడిట్ నివేదిక వెల్లడించింది. కానీ, మార్చి 31 తర్వాత వచ్చిన విరాళాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇది అసలు ప్రభుత్వానిదా? లేక ప్రైవేటుదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రైవేటు వనరుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నందున సమాచార హక్కు చట్టం కిందకు రాదని తాజాగా వెల్లడించినట్లు సమాచారం.
ప్రధానమంత్రి ఛైర్మన్‌గా ఉన్న ఈ ట్రస్టును దిల్లీ రెవెన్యూ శాఖ పేరుతో మార్చి నెలలో రిజిస్టర్ చేశారు. ఈ ప్రత్యేక నిధిని రూ.2,25,000లతో కార్పస్ ఫండ్‌తో మార్చి 27న ప్రారంభించారు. దీనిలో రక్షణ మంత్రి, హోంమంత్రి, ఆర్థికమంత్రులు ట్రస్టీలుగా ఉన్నారు. విరాళాల వివరాలను వెల్లడించిన క్రమంలోనూ దీన్ని ప్రభుత్వ ట్రస్ట్‌గా పేర్కొనలేదు. అయితే, ప్రధాన మంత్రి పిలుపుమేరకు ఈ నిధికి భారీగా విరాళాలు వచ్చాయి. కేవలం స్వదేశంలోనే కాకుండా విదేశాల నుంచి విరాళాలు ఇచ్చేందుకు పీఎం కేర్స్ వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో దాతల పేర్లు బహిర్గతం చేయకపోవడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఏర్పడ్డ పీఎం కేర్స్ ప్రభుత్వానిదా..? లేక ప్రైవేటుకు సంబంధించిందా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇప్పటికే ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్)ఉండగా కొత్తగా దీన్ని ఎందుకు రూపొందించారని విపక్షాలు ప్రశ్నించాయి. వీటితో పాటు పలువురు ఆర్టీఐ కింద సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పటికీ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, విదేశాల నుంచి విరాళాలను సేకరిస్తున్నందున దీన్ని పూర్తిగా ప్రభుత్వ నిధిగా పరిగణించలేమని పేర్కొంది. అందుకే ఆర్టీఐ కిందకు రాదని వెల్లడించింది. అయితే, పీఎం కేర్స్‌పై పలు సందర్భాల్లో విరుద్ధ ప్రకటనలు ఇవ్వడంతో మరోసారి చర్చనీయాంశమయ్యింది. ఇదిలా ఉంటే, ఈ నిధికి ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, సాయుధ దళాల విభాగాలు, ఇతర ప్రైవేటు సంస్థల నుంచి భారీ స్థాయిలో విరాళాలు అందించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'రైతులతో నేరుగా మాట్లాడే ధైర్యం మోదీకి లేదు'