మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ కూటమిగా ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో.. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్నికల సమయంలో భాజపాతో పొత్తు పెట్టుకొని ఫలితాల అనంతరం.. అధికారమే లక్ష్యంగా ఎన్సీపీతో కలవటం ప్రజలను మోసం చేయడమేనని ప్రమోద్ పండిట్ జోషి అనే వ్యక్తి సుప్రీంలో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు పిటిషనర్.
'శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కలయిక అనైతికమైనది. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ పార్టీలు యోచిస్తున్నాయి. ఈ పార్టీల సంకీర్ణంతో ఏర్పాటయ్యే ప్రభుత్వం ప్రజామోదం పొందినది కాబోదని' వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బారున్ కుమార్ సిన్హా వాదనలు వినిపించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం రాజ్యాంగ విరుద్దమని పిటిషన్లో పేర్కొన్నారు జోషి. ఈ పార్టీలు ప్రజామోదం పొందలేదని పిటిషన్లో వివరించారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న పార్టీలకు మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అసోంలో ఘనంగా బ్రహ్మపుత్ర పుష్కర మేళా