కేరళలో వరదల ధాటికి నిండు కుటుంబాలు కూలిపోయాయి. అనేక మంది వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. నదిలో, కొండచరియల కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సమయంలో ఓ పెంపుడు కుక్క తన యజమాని కూతురి మృతదేహాన్ని వెతికి, సహాయక సిబ్బందికి జాడ చూపింది.
ఎనిమిది రోజులు వెతికింది...
ఇడుక్కి జిల్లాకు చెందిన రెండేళ్ల ధనుష్క కుటుంబం ఎనిమిది రోజుల క్రితం వరద ఉద్ధృతికి గల్లంతయ్యింది. దీంతో ధనూక్ష పెంపుడు కుక్క కూవీ ఒంటరైపోయింది. వారి జాడ కోసం తీవ్రంగా శోధించింది. కానీ, లాభం లేకపోయింది. చివరిగా పెట్టిముడి నదిలో ధనుష్క ఆనవాళ్లను గుర్తించింది.
తన చిన్నారి స్నేహితురాలిని ఎలా బయటికి తీయాలో పాలుపోక.. అటూఇటూ తిరుగుతున్న కూవీని గమనించారు సహాయక సిబ్బంది. ఆ ప్రాంతంలో గాలించారు. అనుమానించినట్లే నదిలో చెట్ల నడుమ ఇరుక్కుపోయిన ధనుష్క మృతదేహం కనిపించింది.
సిబ్బంది.. నదిలో నుంచి పాపాయిని బయటికితీశారు. ధనుష్క బయటికైతే వచ్చింది కానీ, తనతో ఆడుకునేందుకు తాను ప్రాణాలతో లేదన్న చేదు నిజాన్ని చాలాసేపటి వరకు జీర్ణించుకోలేకపోయింది కూవీ. ధనుష్క తండ్రి ప్రతీశ్ కుమార్ మృతదేహం గత వారం లభ్యమైంది. తల్లి కస్తూరి, సోదరి ప్రియదర్శినిల జాడ ఇప్పటికీ తెలియలేదు. ఆ చిన్నారి బామ్మ మాత్రం ప్రాణాలతో బతికి బయటపడింది.
ఇదీ చదవండి: పాత కార్లు, బైకులు కంటబడితే కొనేస్తాడంతే!