జామియా మిలియా ఇస్లామియా ఘటన, పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది. పలు చోట్ల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. బంగాల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై జరిగిన దాడిని పలు పార్టీలు ఖండించాయి.
కాంగ్రెస్.. ఇతర విపక్ష పార్టీలు కలిసి ఈ ఘటనపై మీడియా సమావేశం నిర్వహించాయి. 'జామియా' విద్యార్థులపై పోలీసుల తీరును తప్పుపట్టారు కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్. వారి చర్య అత్యంత అమానవీయమని పేర్కొన్నారు. విద్యార్థులపై జరిగిన దాడిపై న్యాయ విచారణ(జ్యుడీషియల్ విచారణ) జరిపించాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని విపక్ష పార్టీల తరపున తమ గళాన్ని వినిపిస్తున్నామని తెలిపారు.
వామపక్షాల నేతృత్వంలో 19న దేశవ్యాప్త నిరసన
విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి పోలీసుల ప్రవేశానికి కారణమైన వారు శిక్షార్హులు అన్నారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ.
పౌరచట్టానికి వ్యతిరేకంగా.. వామపక్షాలు డిసెంబర్ 19న దేశవ్యాప్త నిరసనలు నిర్వహిస్తున్నాయని, అన్ని లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ఆందోళనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సీపీఐ నేత డి.రాజా.
కేంద్ర మంత్రి అమిత్ షా.. అసత్యాలు మాట్లాడుతున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. దేశంలో హిందూ, ముస్లింల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
నిరసనల నేపథ్యంలో డిసెంబర్ 21 బిహార్ బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు ఆర్జేడీ నేత మనోజ్ ఝా.
కేరళలోనూ...
రాజకీయ వైరుధ్యాల్ని పక్కనబెట్టి పౌరచట్టానికి వ్యతిరేకంగా.. కేరళలో అధికార, విపక్షాలు ఉమ్మడిగా నిరసనలు చేపట్టాయి. అధికారంలోని సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం.. విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కలిసి కేంద్రం చర్యను నిరసించాయి. ఈ చట్టంతో స్వేచ్ఛను హరించివేస్తున్నారని ఆరోపించారు నిరసనలో పాల్గొన్న కేరళ సీఎం పినరయి విజయన్.
పౌరచట్టానికి వ్యతిరేకంగా జరిపిన ఈ నిరసన ప్రదర్శనలో.. చిరకాల ప్రత్యర్థులు పాలుపంచుకున్నాయి. సీఎం విజయన్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రమేశ్ చెన్నితాలా ఒకే వేదికను పంచుకోవడం విశేషం. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ, ఆరెస్సెస్, సంఘ్ పరివార్.. దేశాన్ని విభజించాలని చూస్తున్నాయని విరుచుకుపడ్డాయి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు.
రాష్ట్రంలోనూ పలు విద్యార్థి, యువజన సంఘాలు ఆధ్వర్యంలో పౌరచట్టానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు.
'షా'తో భేటీకి కేజ్రీవాల్...
జామియా ఘటనతో దిల్లీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిని కలుసుకునేందుకు సమయం కోరినట్లు తెలిపారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. రాజధానిలో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని.. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దిల్లీలో ఆందోళనకారులు ఆదివారం బస్సులు, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. రాత్రి జరిగిన ఘర్షణల్లో 60 మందికి గాయాలయ్యాయి. ఇందులో విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు.
ఇదీ చదవండి:పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి