మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మిత్రపక్షం శివసేనతో చిక్కులు ఎదుర్కొంటోంది భాజపా. పాలన చెరిసగం ప్రతిపాదనపై పట్టుపట్టింది సేనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. శివసేనతో పాటు భాజపాకు మిత్రపక్షమైన జేడీయూతోనూ చిక్కులు తప్పేలా లేవు.
మోదీ 2.0 ప్రభుత్వం కొలువుదీరే సమయంలో... కేంద్ర కేబినెట్లో చేరేందుకు నిరాకరించింది జేడీయూ. ఒకే సీటు ఇవ్వటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే.. తాజాగా సరికొత్త ప్రతిపాదన చేసింది జేడీయూ. పార్టీ సంఖ్యాబలం దమాషా ప్రకారం కేంద్ర కేబినెట్లో సముచిత స్థానం కల్పించాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఈ ప్రతిపాదనపై చొరవ తీసుకుంటే స్వాగతిస్తామని పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది.
జేడీయూ అధ్యక్షుడిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరో మూడేళ్ల కాలానికి ఎన్నికైన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి. రాష్ట్ర ప్రభుత్వంలో భాజపాకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సముచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు.
"2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు భాజపాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ జేడీయూ మంత్రి పదవులను పంచుకుంది. ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. బిహార్‌లో ఎన్డీఏకి జేడీయూ అతిపెద్ద భాగస్వామి. కేంద్ర ప్రభుత్వంలో జేడీయూకు తగినంత ప్రాతినిధ్యం కల్పిస్తే... బిహార్‌కు మరింత ప్రాధాన్యం లభిస్తుంది.
లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ నుంచి 2017లో భాగస్వామ్యాన్ని తెంచుకుని భాజపాతో జట్టుకడితే.. మోదీ తొలి ప్రభుత్వంలోకి జేడీయూని చేర్చుకోలేదు. రెండోసారి అధికారం చేపట్టినప్పుడు మూడు మంత్రి పదవులను డిమాండ్ చేస్తే ఒకదానికే అంగీకరించారు."
- కేసీ త్యాగి, జేడీయూ ప్రధాన కార్యదర్శి
అయితే.. కేబినెట్ బెర్తుల అంశంలో భాజపాపై తమ పార్టీ ఎటువంటి షరతులు విధించడం లేదని స్పష్టం చేశారు త్యాగి. భాజపాతో పొత్తుపై ఎలాంటి అనుమానలు లేవన్నారు. కానీ.. రానున్న ఝార్ఖండ్, దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కశ్మీర్లో ఈయూ బృందం పర్యటనపై..
ఐరోపా సమాఖ్య ఎంపీల బృందం కశ్మీర్లో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటంపై అభ్యంతరం తెలిపింది జేడీయూ. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడానికి వ్యతిరేకమనే భారత్ విధానానికి ఇది విరుద్ధంగా లేదా అని ప్రశ్నించింది.
ఇదీ చూడండి: బంగారం మింగిన ఎద్దు- బయటకు తీసేందుకు పాట్లు