నిర్భయ దోషులను ఈనెల 22న ఉరితీసి సమాజానికి, మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చాటి చెప్పాలన్నారు ఆమె తల్లి ఆశా దేవి. నిర్భయ మృతిపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు మోదీ సర్కారు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఆలస్యంపై స్పందించారు ఆశా దేవి.
"నేను రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. దూరంగా ఉన్నాను. న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకున్నాను. నేను ఇప్పుడు కచ్చితంగా ఈ విషయాలు చెప్పాలి. 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు ఈ నాయకులే చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకుని మహిళలకు రక్షణ కల్పించాలని నిరసనలు చేపట్టారు. ఇప్పుడు ఆ నాయకులే నా కూతురి మరణంపై రాజకీయాలు చేస్తున్నారు. దోషులకు ఉరిశిక్ష ఆలస్యానికి మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకుంటున్నారు. స్వప్రయోజనాల కోసమే ఉరిశిక్షను ఆలస్యం చేస్తున్నారు. మీ కారణంగా నేను ఆవేదన చెందుతున్నాను.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. మోదీ సర్కారు మహిళలకు అండగా ఉంటుందని 2014లో మీరు చెప్పారు. చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక మంచి పనులు చేశారు. ముమ్మారు తలాఖ్‌ను రద్దు చేశారు. అదే తరహాలో నిర్భయ చట్టానికి న్యాయం చేయండి. చట్టం చేసినంత మాత్రన ఉపయోగం ఉండదు. వాటిని అమలు చేయాలి."
-ఆశా దేవి, నిర్భయ తల్లి.
ఇదీ చూడండి: రాష్ట్రపతి వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్