2012 అత్యాచార కేసులో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ ఠాకూర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్‌పై ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ నెల 17న వాదనలు ఆలకించనుంది.
నిర్భయ కేసు దోషులను ఈనెల 16న ఉరి తీయనున్నారని, అందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో రివ్యూ పిటిషన్‌పై విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కేసులో మరో దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కొద్ది రోజులకే అక్షయ్ సింగ్ పిటిషన్ వేశాడు. "ప్రస్తుత కాలుష్య పరిస్థితుల కారణంగా మనుషుల వయసు తగ్గిపోతున్నప్పుడు మరణశిక్ష ఎందుకు వేయాలి? వెయ్యి సంవత్సరాల జీవితకాలం ఉంటుందని పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. కానీ ఇది కలియుగం. ప్రస్తుత పరిస్థితుల్లో మానవ జీవితకాలం చాలా తగ్గిపోతుంది. 50-60 సంవత్సరాలు మాత్రమే బతుకుతున్నారు. దిల్లీలో ఇప్పటికే వాయు కాలుష్యం కారణంగా మనిషి ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇక అలాంటప్పుడు మరణ శిక్ష వేయడం ఎందుకు? " అని పిటిషన్‌లో పేర్కొన్నాడు అక్షయ్ సింగ్.
ఇదీ చూడండి: 'పౌర' ఆగ్రహం: ఈశాన్యంలో నిరసనలు హింసాత్మకం