మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు తమిళనాడు పోలీసులు. బుధవారం రాత్రి డ్రగ్స్‌తో వెళుతోన్న 9 మందిని రామనాథపురం జిల్లాలోని థొండి పట్టణ సమీపంలో అరెస్ట్ చేశారు. అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన సుమారు రూ. 10 కోట్లు విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో మెథాంఫెటమిన్, యాంఫేటమిన్, మెథక్వాలోన్, ఓపియం పేస్ట్, హెరాయిన్, ఎక్ట్ససీ ఉన్నాయి.
ఎర్ర చందనం..
డ్రగ్స్‌తో పాటు సుమారు 1.5 టన్నుల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిషేధిత మత్తుపదార్థాలు సుమారు 11.4 కిలోలు ఉంటాయని తెలిపారు. సముద్రం మార్గం ద్వారా శ్రీలంకకు వాటిని చేరవేస్తున్నారని వెల్లడించారు.
" అఫ్గానిస్థాన్ నుంచి ఉజ్జెయిన్, గోవా, బెంగళూరు, కొయంబత్తూర్, మదురై, థొండి మీదగా శ్రీలంకకు అక్రమ రవాణా చేస్తున్నట్లు రెండు వారాల క్రితం సమాచారం అందింది. ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. బుధవారం మరోమారు అందిన సమాచారంతో గోవింద మంగళం-మూపైయుర్ రోడ్డులో సాయంత్రం 7 గంటలకు ఆనందుర్ నుంచి తిరువదనాయ్కు వెళుతున్న ఓ ఆటోను పట్టుకున్నాం. వారి వద్ద నుంచి మాదకద్రవ్యాలు, ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నాం. ఆటో డ్రైవర్ ఎం అబ్దుల్ రహీమ్ (49), జి. అరుల్దోస్ (43), అజ్మల్ ఖాన్ (48), కేశవన్ (42)ను కస్టడీలోకి తీసుకున్నాం."
– వరుణ్ కుమార్, రామనాథపురం జిల్లా ఎస్పీ.
ఆటో వెనుక వస్తోన్న రెండు ద్విచక్రవాహల్లో ఒక వాహనాన్ని పట్టుకోగా మరో బైక్‌పై ఉన్నవారు పరారైనట్లు తెలిపారు ఎస్పీ. ద్విచక్రవాహనదారులు ఆర్, ముత్తు రాజా (38), ఎస్. సురేశ్ కుమార్ (44) సహా.. సరకు డెలివరీ కోసం కారులో వేచివున్న మరో ముగ్గురు అజ్మీర్ ఖాన్ (42), అబ్దుల్ వాహబ్ (36), అబ్దుల్ అజాద్ (23)ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
శ్రీలంక టూ ఆస్ట్రేలియా..
ఎర్ర చందనం దుంగలతో పాటు మత్తుపదార్థాలను శ్రీలంకకు థొండి హార్బర్ మీదుగా తరలిస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు ఎస్పీ. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు చేరవేయనున్నట్లు తెలిసిందన్నారు. మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలు (ఎన్డీపీఎస్) చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు ఐపీసీలోని 120బీ, సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.