కేరళలో షిగెల్లా వ్యాధి ఇంకా అదుపులోకి రాలేదు. కన్నూరు జిల్లాలోని చిత్తారిప్పరంబులో ఆరేళ్ల బాలుడికి గురువారం షిగెల్లా వ్యాధి సోకగా.. ఇప్పుడు కోజికోడ్ జిల్లా కూడరంజి గ్రామంలో పదమూడేళ్ల బాలుడికి సైతం వ్యాధి నిర్ధరణ అయింది. ఆ బాలుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోజికోడ్‌లో షిగెల్లా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.
షిగెల్లా లక్షణాలివే..
షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన వ్యక్తి అనారోగ్యం పాలవుతాడని.. నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, మలవిసర్జన సమయంలో రక్తం వంటివి షిగెల్లా లక్షణాలు.
పరిశుభ్రతే మందు..
నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశించే అవకాశమున్న ఈ బ్యాక్టీరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తరచుగా సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవడం, కాచి చల్లార్చిన తాగునీటి వినియోగం వంటి జాగ్రత్తలతో షిగెల్లాకు దూరంగా ఉండొచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: కోజికోడ్‌లో మరో షిగెల్లా కేసు.. ఈసారి శిశువుకు