ఉత్తరాఖండ్‌లో లిపులేఖ్ పాస్‌ను అనుసంధానిస్తూ దార్చులా వద్ద కొత్తగా నిర్మించిన రోడ్డుపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్... రోజుల వ్యవధిలోనే భారత్ భూభాగానికి అతి సమీపంలో సైన్యాన్ని మోహరించింది. కాలాపానీ సమీపంలోని ఛంగరూ అనే ప్రాంతంలో గస్తీ నిర్వహించేందుకు ఏకంగా ఆర్మీ పోస్టు(బోర్డర్ రిజర్వు పోస్టు)ను ఏర్పాటు చేసింది నేపాల్. 34 మందిని సైనికులను హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చి విధుల్లోనూ పెట్టింది. ఇది నేపాల్ పరిధిలోనే ఉన్నా... ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్ జిల్లాకు చాలా దగ్గరి ప్రాంతం కావడం వల్ల భారత్ అభ్యంతరం లేవనెత్తింది.
తొలిసారి నేపాల్ ఈ విధమైన చర్యలకు పాల్పడటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. చైనా ఆదేశాలతోనే నేపాల్ తన వైఖరి మార్చుకుందని.. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రయత్నిస్తోందని ఇప్పటికే భారత సైన్యాధిపతి ఎం.ఎం.నరవాణే విమర్శించారు.
అనుమతి లేకుండానే...
పితోడ్‌గఢ్ సమీపంలో పోస్టు ఏర్పాటు చేసినట్లు, ఆర్మీ అధికారులను తీసుకొచ్చినట్లు తమకు సమాచారం లేదని పేర్కొన్నారు స్థానిక జిల్లా అధికారి విజయ్ కుమార్. ఈ విషయంపై నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.
ఇదీ జరిగింది...
భారత్-నేపాల్ మధ్య వివాదాస్పదంగా మారిన కాలాపానీ ప్రాంతం తమదేని... ఇటీవల భారత్‌లోని నేపాల్ రాయబారి నిలాంబార్ ఆచార్య ప్రకటించడాన్ని భారత్ ఖండించింది. అది తమ దేశంలోని ఉత్తరాఖండ్ భూభాగంలోనిదని స్పష్టం చేసేలా.. గతేడాది నవంబర్ 2న కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లను సూచిస్తూ మ్యాప్‌ను విడుదల చేసింది. చైనాను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు అదే రాష్ట్రంలోని లిపులేఖ్ వద్ద రహదారినీ ఇటీవల ప్రారంభించింది భారత ప్రభుత్వం. వీటన్నింటినీ ఉద్దేశించి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని అప్పట్నుంచి భారత్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది నేపాల్. తాజాగా భారత సరిహద్దు సమీపంలో బలగాలనూ మోహరించింది. మరోవైపు చైనా కూడా భారత్‌తో సరిహద్దు పంచుకునే ప్రాంతాల కవ్వింపు చర్యలకు పాల్పడింది.
'కాలాపానీ' చాలా కీలకం..
భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న కాలాపానీ... రెండు దేశాల మధ్య వివాదానికి కారణణైంది. ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్.. నేపాల్‌లోని దర్చులా జిల్లాలకు సరిహద్దుగా ఉందీ ప్రాంతం. మహాకాళీ నది ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తోంది. 1816లో సుగౌలీ ఒప్పందం ప్రకారం మహాకాళీ నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. మహాకాళీ నదిలో కాలపానీ వద్ద అనేక ఉపనదులు కలుస్తాయి. ఈ ప్రాంతం ట్రై జంక్షన్ లాంటిది. నేపాల్, చైనా, భారత సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. దీంతో రక్షణపరంగా దీనికి ప్రాధాన్యం ఉంది. భూటాన్‌లోని డోక్లాంకు ఎంతటి ప్రాధాన్యం ఉందో కాలాపానీకి కూడా అంతే గుర్తింపు ఉంది.
ఇరు దేశాల వాదన ఇలా..
కాలాపానీలోనే మహాకాళీ నది జన్మిస్తుంది కాబట్టి పశ్చిమ భాగం మొత్తం మనకే చెందినదని భారత్ వాదిస్తోంది. అయితే లిపుగడ్‌కు తూర్పు ప్రాంతమంతా నేపాల్ కిందకు వస్తోందని ఆ దేశం వాదిస్తోంది. 1830కు సంబంధించిన పితోడ్‌గఢ్ రికార్డులను భారత్ తన వాదనకు మద్దతుగా బయటపెట్టింది.
1879లో బ్రిటిష్ ఇండియా అధికారులు రూపొందించిన చిత్రపటం మేరకు కాలాపానీ మొత్తం ప్రదేశం భారత్‌లోనే ఉంది. నేపాల్‌కు చెందిన ఒక అంగుళం భూమి కూడా భారత్ ఆక్రమించుకోదని భారత్ ఇది వరకే స్పష్టంచేసింది. ఈ సమస్యపై ద్వైపాక్షికచర్చలు జరగాలని రక్షణరంగ నిపుణులు సూచిస్తున్నారు.
పొంచివున్న చైనా..
ఈ ప్రదేశంలో ఎలాగైనా కాలుపెట్టాలని చైనా యోచిస్తోంది. ఇప్పటికే నేపాల్‌తో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా.. రక్షణ పరంగాను వ్యూహాలు పన్నుతోంది. ట్రైజంక్షన్‌గా ఉండటం వల్ల కాలాపానీలో కాలుపెడితే పైచేయి సాధించవచ్చన్నది చైనా యోచన. ఇందులో భాగంగానే తన నీడలో నేపాల్‌ను పావుగా వాడుకుంటూ ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది.