దుబాయ్‌లోని భారతీయ సంతతికి చెందిన ఓ 16 ఏళ్ల బాలుడు.. వినూత్న ఆవిష్కరణ చేశాడు. గోడలకు రంధ్రాలు చేయకుండానే.. బరువైన వస్తువులను వేలాడదీసే మార్గాన్ని కనుగొన్నాడు.
ఓ కొత్త టేప్..
దుబయ్‌లోని జెమ్స్ అకాడమీలో ఇషిర్.. పదో తరగతి చదువుతున్నాడు. అతని పదోతరగతిలో భాగంగా ఏదైనా ఒక ఆవిష్కరణను చేపట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో.. మేకులు కొట్టడం వల్ల గోడలు దెబ్బతింటున్నాయనే విషయాన్ని అతడు గమనించాడు. దీనికి పరిష్కారంగా.. బరువైన వస్తువులను వేలాడ దీసేందుకు వీలుగా ఉండే ఓ కొత్త టేప్‌ను సృష్టించాడు.
ఎలా చేశాడు..
ఆల్ఫా, బీటా అనే రెండు స్టీల్ టేప్‌లను నియోడైమియమ్ అనే అయస్కాంతం సాయంతో జత చేసి, ఈ కొత్త టేప్‌ను సృష్టించాడు. దీనికోసం అతని సోదరుడు అవిక్ సహకారాన్ని తీసుకున్నాడు ఇషిర్. అమెరికాలోని ప్రూడ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు అవిక్. ఈ ప్రాజెక్టుకు వాళ్లు 'కల్పిత్' అనే పేరు పెట్టారు.
"స్క్రూలను, మేకులను ఉపయోగించినప్పుడు గోడలు దెబ్బతింటాయి. ప్రత్యేకంగా పనివాళ్ల అవసరమవుతుంది. అలాగే.. దుమ్ము, ధూళి వ్యాపించి ఇబ్బంది పడతారు. ఈ సమస్యలేవీ లేకుండా నేను మా అన్నయ్యతో కలిసి ఈ 'కల్పిత్'ను సృష్టించాను."
-- ఇషిర్, పదో తరగతి విద్యార్థి.
ఆనందంలో ఇషిర్ తండ్రి..
ఇషిర్ చేసిన కృషికి అతని తండ్రి సుమేశ్ వాధ్వా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తామిప్పుడు గోడలకు హాని చేయకుండానే వస్తువులను వేలాడదీయగలుగతున్నామని అంటున్నాడు.
"ఈ అయస్కాంతంతో మేమిప్పుడు మా ఇంట్లో గోడలకు రంధ్రాలు చేయకుండానే.. హోంథియేటర్ను వేలాడదీస్తున్నాం. అంతకుముందు పదేళ్లుగా మా ఇంట్లో స్పీకర్లు నేలమీదే ఉండేవి. ఇప్పుడు దానికి ఓ పరిష్కారం లభించింది. మా పిల్లలు దీన్ని కనిపెట్టినప్పుడే నాకనిపించింది... ఇది కచ్చితంగా మంచి గుర్తింపు సాధిస్తుందని."
-- సుమేశ్ వాధ్వా, ఇషిర్ తండ్రి.
సుమేశ్ ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 'కల్పిత్'ను కుటుంబ వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఇదీ చూడండి:బాబియా... ఇదొక శాకాహార మొసలి