అందరికీ ఉంటాయి కలలు... వాటిని సాకారం చేసుకోగలవారు కొందరే. అలాంటి వింతైన, సృజనాత్మకమైన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు బిహార్ వాసి. సరణ్ జిల్లా బనియాపూర్‌లో కారును హెలికాప్టర్లా మార్చాడు.
బనియాపూర్ ప్రాంతం సరమీ గ్రామానికి చెందిన మిథిలేశ్ ప్రసాద్‌కు గాల్లో ఎగరాలని కోరిక. అందుకోసం పైపుల ఫిట్టర్‌గా తనకున్న అనుభవంతో సొంతంగా హెలికాప్టర్ తయారు చేసుకోవాలని అనుకున్నాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. చేసే పని చిన్నది. కానీ ఆయన మనసు ఓటమిని అంగీకరించలేదు. తన ఆశను ఎలాగైనా తీర్చుకోవాలని ఆలోచించాడు మిథిలేశ్.
ఆకాశం తళుక్కుమన్న రీతిగా చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తన వద్ద ఉన్న డబ్బుతో పాత నానో కారొకటి కొన్నాడు. దానికి హెలికాప్టర్ రూపం ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించాడు.
ఏడునెలల కష్టం...ఏడు లక్షల ఖర్చు
హెలికాప్టర్ కలను నెరవేర్చుకునేందుకు తాను చేస్తున్న పైప్ ఫిట్టింగ్ పనిని వదిలేశాడు మిథిలేశ్. కారుకు హెలికాఫ్టర్ వెనుకభాగాన్ని తయారుచేయించి అమర్చాడు. పైన తిరిగేందుకు రెక్కలు బిగించాడు. ముందు భాగాన్ని హెలికాప్టర్లా మార్చాడు. ఇలా ఏడు నెలలు శ్రమించి కారుకు హెలికాప్టర్ రూపం తీసుకవచ్చాడు మిథిలేశ్. ఇందుకు అక్షరాల ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
ఎగరడం సాధ్యం కాకపోయినా..... మిథిలేశ్‌కు హెలికాప్టర్ ముచ్చట తీరింది. రోడ్డుపై అందరి చూపు ఈ నానో చాపర్పైనే.
ఇదీ చూడండి: పసిబిడ్డ హత్యకు తల్లి యత్నం- కాపాడిన శునకం