ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్... ప్రకృతి సంపదకు, అందమైన సరస్సులకు ప్రతీతి. దేశవిదేశాల నుంచి ఇక్కడికి భారీ సంఖ్యలో పర్యటకులు తరలివస్తారు. నైనిటాల్ సరస్సు సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ... బోట్ ర్యాఫ్టింగ్ చేస్తూ ఆనందంలో తేలిపోతుంటారు.
ప్రకృతి ఒడిలో ఒదిగిన నైనిటాల్ సరస్సులో రంగురంగుల పడవలతో నావికుల చేసే విన్యాసాలు నీటిమీద రంగవల్లులు చల్లారా అన్నంత చక్కగా కన్పిస్తాయి.
కేవలం సరస్సే కాదండోయ్... నైనిటాల్ నలువైపులా ప్రకృతి సంపద అలరారుతుంది. ప్రకృతి పచ్చని చీర కట్టుకుని నాట్యం చేసినట్లుండే అటవీ ప్రాంతాన్ని సందర్శించే వారి మనస్సులు ఆనంద డోలికల్లో తేలియాడతాయి. సాత్తాల్, నౌకుచియాతాల్, సరియాతాల్, కుర్పాతాల్, గరుణతాల్, భీమ్ తాల్, సుఖా తాల్ నైనిటాల్‌కు కొద్ది దూరంలో ఉంటాయి. నైనిటాల్ను సందర్శించేవారు ఈ సరస్సుల్ని చూసిగానీ వెనక్కిమళ్లరు.
సరస్సు అందాల్ని చూడటానికే కాదు ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చే పర్యటకులు ఇక్కడ ఎక్కువే. ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి పక్షుల కిలకిలరావాల్ని ఆస్వాదిస్తుంటారు. నైనిటాల్ గుహ ఉద్యానవనం, నైనీ దేవీ మందిరం... నైనిటాల్లో చూడదగిన ప్రదేశాలు. ఇన్ని ప్రత్యేకతలున్న నైనిటాల్‌కు ఈ వేసవిలో చెక్కేయండి మరి.