పౌరసత్వ చట్ట సవరణ, ఎన్ఆర్సీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. దేశంలో చెలరేగుతున్న హింసను వారు పట్టించుకోవడం లేదన్నారు.
దిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో భాగంగా ఈ విధంగా స్పందించారు సోనియా. దేశవ్యాప్తంగా యువత నిరసనలు చేస్తున్నారని.. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు.
"దేశంలో జరుగుతున్న నిరసనలకు ముఖ్య కారణం ఎన్ఆర్సీ, సీఏఏ. యువతలో ఉన్న నిరాశ, ఆగ్రహం ఈ ఆందోళనల్లో ప్రతిబింబిస్తున్నాయి. మోదీ-షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు చేసిన వ్యాఖ్యలను కొద్ది వారాల ముందు వారే వ్యతిరేకించారు. వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ జాతీయ అనిశ్చితి, హింసపై వారు స్పందించడం లేదు. ప్రజలకు భద్రత కల్పించటంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. "
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు.
ఎన్పీఆర్తో.. ఎన్ఆర్సీ
అసోంలో ఎన్ఆర్సీ విఫలమైనందున, ఇప్పుడు ఎన్పీఆర్పై ప్రభుత్వం దృష్టి సారించిందని సోనియా అభిప్రాయపడ్డారు. హోంమంత్రి వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నప్పటికీ... దేశవ్యాప్త ఎన్ఆర్సీకి ఈ ఎన్పీఆర్ దోహద పడుతుందన్నారు.
ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎల్జేడీ చీఫ్ శరద్ యాదవ్, వామపక్షాల నేతలు సీతారాం ఏచూరీ, డీ రాజా పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ భేటీకి హాజరయ్యారు.
ఇదీ చూడండి:- విపక్షాల భేటీకి బీఎస్పీ, తృణమూల్, ఆప్ దూరం