చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో రెండు రోజులపాటు జరుగుతోన్న అనధికారిక సమావేశంలో భాగంగా నిన్న మామల్లపురం వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రోజు తెల్లవారుజామున మామల్లపురం సముద్రతీరానికి వెళ్లిన మోదీ అక్కడి బీచ్‌లో 'స్వచ్ఛభారత్' చేపట్టారు. బీచ్‌లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించారు. దాదాపు అరగంట పాటు మోదీ బీచ్‌ను శుభ్రం చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఉదయం పూట అందరూ జాగింగ్ చేయాలని... ఆ సమయంలో ప్లాస్టిక్ కనిపిస్తే ఏరిపారేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం 'పాస్టిక్ ఏరివేత + జాగింగ్= ప్లాగింగ్' అనే నినాదం ఇచ్చారు.
"మామల్లపురం బీచ్‌కు జాగింగ్ వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం." - నరేంద్ర మోదీ, ప్రధాని