కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను గెలిపిస్తే అవినీతికి అనుమతి మంజూరు చేసినట్లేనని ఎద్దేవా చేశారు.
భాజపా ఎన్నికల ప్రణాళిక సంకల్ప్ పాత్రలో దేశాభివృద్ధికి సంబంధించిన ఎన్నో అంశాల్ని చేర్చామని స్పష్టం చేశారు. ఎన్డీఏకు మద్దతివ్వాలని నూతనంగా ఓటు హక్కును వినియోగించుకోనున్న యువ ఓటర్లకు విన్నవించారు.
"కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను గెలిపించడం అవినీతికి లైసెన్సులు మంజూరు చేసినట్లే. దేశం ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన పెద్ద కుంభకోణం గురించి చర్చిస్తుంది. ఇది తుగ్లక్ రోడ్ ఎన్నికల కుంభకోణం. మధ్యప్రదేశ్‌లో కోట్లరూపాయలు, బ్యాగుల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ అవినీతికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ డబ్బంతా దిల్లీ తుగ్లక్ రోడ్డులోని ఓ కాంగ్రెస్‌నేత ఇంటికి చేరుకున్నాయి. అక్కడ ఎవరు నివాసం ఉంటారో తెలుసా?. ఈ సొమ్ము మహిళలకు, చిన్నారులకు పోషకాహారం అందించాల్సిన డబ్బు నుంచి అవినీతి చేశారు. చాలాకాలం తర్వాత ఆ రాష్ట్రంలో వారు అధికారంలోకి వచ్చారు. వారు ప్రజలకు సేవ చేయాల్సిన సమయంలో అవినీతికి పాల్పడ్డారు."- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి