సంచలన నిర్ణయాలు... చారిత్రక సంస్కరణలు... భారతావని ముఖచిత్రాన్ని మార్చిన సంక్షేమ పథకాలు... పదునైన రాజకీయ వ్యూహాలు... నరేంద్రమోదీ సర్కారు తొలిదఫా సాగిన తీరు ఇది. ఐదేళ్ల పాలనను జనభారతం మెచ్చింది. మరోమారు జైకొట్టింది. 2014ను మించిన ఆధిక్యంతో నరేంద్రుడికి రెండోసారి అధికార పగ్గాలు అప్పగించింది.
కేంద్రంలో మోదీ 2.0 ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు. అసాధారణ మెజార్టీతో లభించిన ప్రజామోదాన్ని ఎన్డీఏ సర్కారు ఎలా పరిగణించింది? ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రగతి రథం వేగం పెంచిందా? లేక సంచలనాలు, సంస్కరణల పథంలో దూకుడు పెంచిందా? మోదీ 2.0 ప్రభుత్వ 100 రోజుల పాలన ఎలా సాగింది?
''100 రోజుల్లో భాజపా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. విజయవంతమైంది. ఈసారి పార్లమెంటు సమావేశాల ఉత్పాదకత చూడండి. 36 కొత్త బిల్లులు ఆమోదం పొందాయి. 130 శాతం ఉత్పాదకతతో పార్లమెంటు సమావేశాలు నడిచాయి. ఇదే ఇప్పటివరకు రికార్డు. పార్లమెంటు సమావేశాలతో ఏం జరిగింది? కొత్త చట్టాలు రూపొందాయి. ఇలాంటి చట్టాల అమలుతో దేశంలోని వ్యవస్థలన్నీ సక్రమంగా నడుస్తున్నాయి.''
-గోపాల్ అగర్వాల్, భాజపా జాతీయ అధికార ప్రతినిధి
100 రోజులు... కీలక చట్టాలు....
"60 ఏళ్లలో కాని పనులను 60 నెలల్లో చేసి చూపిస్తా..."... 2014 ఎన్నికల సమయంలో మోదీ పదేపదే చెప్పిన మాట. ఈ మాటను రెండో దఫా పాలన తొలి 100రోజుల్లో అక్షరాలా నిజం చూపించారు నరేంద్రుడు. అనేక దశాబ్దాలుగా నానుతున్న సమస్యలకు తిరుగులేని పరిష్కారం చూపారు. అలాంటి నిర్ణయాల్లో కీలకమైనవి కొన్ని....
- ముమ్మారు తలాక్ నిషేధం చట్టం అమలు
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు
- జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు ఆమోదం
- జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు ఆమోదం
- మోటార్ వాహనాల చట్టం సవరణ... ట్రాఫిక్ ఉల్లంఘనలకు కళ్లెం వేసేలా నిబంధనలు కఠినతరం
- దివాలా చట్టం సవరణ, పాత చట్టాల రద్దు, ఆర్టీఐ చట్టం సవరణ
- నీటివనరులు, తాగునీరు, పారిశుద్ధ్య శాఖలను విలీనం చేసి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని రైతులందరికీ వర్తింపు... ప్రతి రైతుకు రూ.6వేలు ఆర్థిక సాయం
- చిన్న, సన్నకారు రైతులకు 'కిసాన్ మాన్ ధన్ యోజన' పేరిట పింఛను పథకం ప్రకటన... 60 ఏళ్లు దాటిన రైతులకు నెలకు రూ. 3 వేలు పెన్షన్
ఆపరేషన్ కశ్మీర్: అధికరణ 370 రద్దు
మోదీ ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం.. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు. పొరుగు దేశం కుట్రల కారణంగా కశ్మీర్‌ను పట్టిపీడిస్తున్న ఉగ్రవాద భూతాన్ని శాశ్వతంగా తరిమికొట్టే లక్ష్యంతో ఈ పని చేసింది ఎన్డీఏ సర్కార్. రాజకీయ విమర్శలను బేఖాతరు చేస్తూ... దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ముందడుగు వేసింది. ఇందుకు పార్లమెంటు ఆమోదం పొందేందుకు పకడ్బందీ వ్యూహం అమలుచేసి, తిరుగులేని విజయం సాధించింది.
మోదీ సర్కార్ 100 రోజుల పాలనలో దౌత్యపరంగానూ పాకిస్థాన్‌పై పైచేయి సాధించింది భారత్. కశ్మీర్... భారత్‌కు ముమ్మాటికీ అంతర్గత అంశమేనని అంతర్జాతీయ వేదికలపై స్పష్టంగా చెబుతూ.... పొరుగు దేశ వాదనల్ని ఎప్పటికప్పుడు పటాపంచలు చేసింది.
ముమ్మారు తలాక్ చట్టం...
నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి ముమ్మారు తలాక్ చట్టం ఆమోదం. ముస్లిం మహిళలకు ఏకకాలంలో మూడుసార్లు తలాక్ చెబితే.. కొత్త చట్టం ప్రకారం భర్తలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. మోదీ తొలి ప్రభుత్వంలోనూ ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా.. రాజ్యసభ గడప దాటలేకపోయింది. ఈ బిల్లు ఆమోదంపై మొదటినుంచి గట్టి పట్టుదలగా ఉన్న భాజపా ప్రభుత్వం... రెండో ప్రయత్నంలో విజయం సాధించింది.
అసోం ఎన్ఆర్సీ...
జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)... కొంత కాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసోంలో ఎన్ఆర్సీ జాబితా విడుదల చేసి సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచింది మోదీ ప్రభుత్వం. పలు దఫాలుగా ముసాయిదాలు విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం... తుది జాబితా విడుదలకు గడువు కోరుతూ వచ్చి.. 2019 ఆగస్టు 31న ఎన్ఆర్సీ ప్రకటించింది.
3 కోట్ల 11 లక్షల 21 వేల 4 మందికి జాబితాలో చోటు లభించింది. దాదాపు 19 లక్షల మందికిపైగా ఇందులో చోటు దక్కలేదు. అయితే... దీనిపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు వినిపించాయి. నిజమైన ఎందరో భారతీయులకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డాయి విపక్ష పార్టీలు.
సవాళ్ల స్వాగతం...
"భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేయడమే లక్ష్యం"... మోదీ పదేపదే చెప్పే మాట ఇది. ఇందుకు అవసరమైన సంస్కరణలను తొలిదఫాలోనే ప్రారంభించారు. మలి దఫాలో వాటి అమలు వేగం మరింత పెరుగుతుందని అందరూ ఊహించారు. కానీ... పరిస్థితి తారుమారైంది. ఆర్థిక మాంద్యం భూతం... అంతర్జాతీయంగా అందరినీ భయపెడుతోంది. భారత్‌లోనూ వృద్ధి సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పతనమైంది. ఇది ఆరేళ్ల కనిష్ఠం.
''మోదీ ప్రభుత్వం 100 రోజుల్లో రాజకీయాంశాలపరంగా... కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించింది. ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. తమ రాజకీయ విధానాలతో ప్రపంచానికి, సమాజానికి గట్టి సందేశం ఇచ్చింది. అయితే.. ఇదంతా రాజకీయం.
ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక మందగమనం సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలోనే మోదీ ప్రభుత్వం.. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి స్పష్టమైన ప్రణాళికతో ఉందా? లేదా? అని అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పయనించట్లేదు. ప్రభుత్వానికి ఓ మంచి ఆలోచనా దృక్పథం ఉండొచ్చు. కానీ.. దానిని సక్రమంగా ఆచరణలో పెట్టట్లేదు. ఈ అంతరమే... ప్రభుత్వానికి కాస్త ప్రతికూల అంశం.''
- విజయ్ సర్దానా, ఆర్థిక వేత్త, సెబీ సలహాదారు
మాంద్యం ముప్పును ముందే గుర్తించింది మోదీ సర్కార్. వెంటనే నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. బ్యాంకుల విలీనం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం అందజేత వంటి కీలక నిర్ణయాలతో వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సంపన్నులపై సర్ఛార్జ్ రద్దు వంటి నిర్ణయాల ఉపసంహరణ, ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ వంటి చర్యలతో మదుపర్లలో విశ్వాసం నిలుపుకునేందుకు యత్నించింది.
ఐదు సంవత్సరాలు కాలవ్యవధి గల ప్రభుత్వంలో... 100 రోజులనే ప్రామాణికంగా తీసుకొని పాలనపై ఒక అంచనాకు రాలేము. అయితే.. తుది లక్ష్యం సాధనకు, ప్రజలకు ఇచ్చిన హామీల పూర్తిస్థాయి అమలుకు ఈ తొలి 100 రోజుల పనితీరు ఎంతో కీలకం.
ఇదీ చూడండి: రష్యాకు మోదీ గిఫ్ట్: ఆర్థిక సాయంగా ఒక బిలియన్ డాలర్లు