కరోనా నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతికదూరం పాటిస్తూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించడం ఎలా? అన్న అంశంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం తన సచివాలయ అధికారులతో సమీక్షించారు. ప్రతి సభ్యుడి మధ్య కనీసం రెండు గజాల దూరం తప్పనిసరి అయినందున సభలో అందుకు తగ్గట్టు సీట్లు ఏర్పాటుచేయడంపై సమాలోచనలు జరిపారు. రాజ్యసభ ఛాంబర్‌తో పాటు, దానికున్న వివిధ గ్యాలరీల్లో భౌతికదూరానికి అనుగుణంగా సభ్యులను కూర్చోబెట్టి, మిగిలిన వారు పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్‌హాల్, బాలయోగి ఆడిటోరియం నుంచి వర్చువల్‌గా సభా కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడానికున్న అవకాశాలపై చర్చించారు.
పరిమితుల దృష్ట్యా..
నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్‌కు ఉన్న పరిమితుల దృష్ట్యా సభ్యులందరూ వర్చువల్‌గా పాల్గొనేందుకు అవకాశం ఉండదని అధికారులు చెప్పగా, ఆ పరిమితులను సరిదిద్దాలని వెంకయ్యనాయుడు వారికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సభ్యులందరికీ వర్చువల్ సౌకర్యం కల్పించడం తప్పనిసరి కనుక వేగంగా దాన్ని విస్తరింపజేయాలని ఆదేశించారు. సభా కార్యకలాపాల్లో సభ్యులు సాధ్యమైనంత మేరకు ప్రత్యక్షంగా పాల్గొనేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. భౌతిక దూరం నిబంధనల ప్రకారం రాజ్యసభతో పాటు, దాని గ్యాలరీల్లో 127 సభ్యులు కూర్చోవడానికి అవకాశం ఉన్నందున ఆ సీట్లను పార్టీల బలాబలాలకు అనుగుణంగా కానీ, లేదంటే సభలో చర్చల్లో పాల్గొనేవారికి ప్రాధాన్యం ఇచ్చేలాకానీ కేటాయిస్తూ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రశ్నోత్తరాలు, సభలో అవసరమైనప్పుడు ఓటింగ్ నిర్వహించడం ఎలా అన్న అంశంపై కూడా చర్చించారు. కొత్త సభ్యుల ప్రమాణం, సభ్యులకు రవాణా సౌకర్యం కల్పన, అన్నిచోట్లా భౌతికదూరం పాటించడం, శానిటైజ్ చేయడం గురించీ మాట్లాడారు. చర్చించిన అన్ని అంశాలపై వచ్చే వారంలోపు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు.
స్థాయీసంఘ సమావేశాలకు భౌతికదూరం నిబంధన
గోప్యతను దృష్టిలో ఉంచుకొని.. పార్లమెంటు స్థాయీసంఘ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. సభ్యుల ప్రత్యక్ష హాజరులోనే వీటిని నిర్వహించాలని, అయితే కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు. ఈమేరకు లోక్‌సభ సచివాలయం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలను ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో సభ్యుల ప్రత్యక్ష హాజరులో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈమేరకు స్థాయీసంఘ సమావేశాలను పార్లమెంటు సమావేశాల నిర్వహణకు ఒక నమూనాగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ వారంలో పార్లమెంట్ ఓబీసీ వెల్ఫేర్ స్థాయీసంఘ సమావేశం జరగనుంది.
స్థాయీసంఘ సమావేశాలకు మార్గదర్శకాలివే..
- సమావేశాల్లో సభ్యులు కనీసం ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా సీట్లు ఏర్పాటు చేయాలి. కమిటీ రూముల ప్రవేశ ద్వారాల్లో శానిటైజర్లు ఉండాలి.
- సభ్యులకు అన్ని డాక్యుమెంట్లూ డిజిటల్ రూపంలోనే సరఫరా చేయాలి.
- కమిటీల ముందుకు సాక్ష్యం ఇవ్వడానికి హాజరయ్యే వివిధ శాఖల అధికారులు తీసుకొచ్చే దస్తావేజులు, రిపోర్టులు కూడా డిజిటల్ రూపంలోనే సభ్యులకు అందుబాటులో ఉంచాలి.
- కమిటీల ముందుకు గరిష్ఠంగా అయిదుగురు అధికారులు మాత్రమే రావాలి. ఒకవేళ ఎక్కువ మంది రావాల్సిన పరిస్థితి ఉంటే వారికి లాబీల్లో భౌతికదూరం ప్రకారం సీట్లు ఏర్పాటు చేయాలి.
- కమిటీ నివేదికలు రికార్డు చేయడానికి పార్లమెంటు సచివాలయ సిబ్బంది ప్రత్యక్షంగా వెళ్లి కూర్చోకుండా ఆడియో రికార్డింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.
ఇదీ చూడండి: రైల్వే బోర్డు కీలక నిర్ణయం.. కొలువులకు ఎర్రజెండా