పాకిస్థాన్ మీదుగా భారత్‌లోకి మిడతల వ్యాప్తి జులై మధ్య వరకు కొనసాగే అవకాశం ఉందని 'మిడతల హెచ్చరిక కార్యాలయం'(ఎల్‌డబ్ల్యూఓ) సహాయ సంచాలకుడు డాక్టర్ కె.ఎల్.గుర్జార్ ఈటీవీ భారత్‌తో పేర్కొన్నారు. ఈ పురుగుల కారణంగా భారత్‌లో ఇప్పటి వరకు పంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలిపారు. ఒక్క రాజస్థాన్‌లోనే 5 శాతం మేర పత్తి పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్రల్లో ఈ చీడల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో గుజరాత్‌లో ఈ పురుగుల దండు వ్యాప్తి చెందిందని, ప్రస్తుతం అక్కడ వాటి ఉనికి లేదని స్పష్టం చేశారు గుర్జార్.
ఏప్రిల్ 30 నుంచి ఇప్పటివరకు 23 మిడతల గుంపులు దేశంలోకి వచ్చాయని, ఒక వారానికి 5 గుంపులు చొప్పున వస్తున్నట్లు గుర్తించామన్నారు గుర్జార్. వీటి అదుపునకు ప్రత్యేకంగా డ్రోన్లను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌డబ్ల్యూఓలో ఇందుకోసం 200 మందికి పైగా పనిచేస్తున్నారని, 47 బృందాలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఖరీఫ్ పంట సీజన్ నాటికి మిడతలను అదుపు చేయకుంటే.. ఆ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ పురుగుల కారణంగా దిల్లీ వంటి నగరాలకు ఏ ఇబ్బందీ లేదని భరోసా ఇచ్చారు. కీటకాల అదుపునకు రాత్రివేళ చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని, వాటి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాటి ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు.
విమానాలకూ ముప్పు
మిడతల దండుతో విమానాల రాకపోకలకు ముప్పు పొంచి ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. విమానాలు ఎగిరే, దిగే సమయంలో ఈ పురుగులు చుట్టుముట్టే ప్రమాదం ఉన్నందున పైలెట్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. రాత్రి పూట మిడతలు ఎగరవు కాబట్టి ఆ సమయంలో ప్రయాణాలకు ఇబ్బంది ఉండదని విమానయాన అధికారులు తెలిపారు.