దిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శుక్రవారం రాత్రి 6.30గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
"చట్టాన్ని గౌరవించటం చట్ట సభ్యునిగా నా కర్తవ్యం. వాళ్లు నాకు సమన్లు జారీ చేశారు. నన్ను ఎందుకు పిలిచారో తెలియదు. మనీలాండరింగ్ అంటున్నారు. వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనీయండి. నేను ఏ తప్పు చేయలేదు. స్వచ్ఛంగా ఉన్నాను. వాళ్లు ఏం అడిగినా చెబుతాను."
-డీకే శివకుమార్, కర్ణాటక మాజీ మంత్రి
శివకుమార్‌ను 4 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో విచారించింది. రాత్రి 11.30 గంటలకు కార్యాలయం నుంచి బయటికి వచ్చారు డీకే.
ఈ కేసు నేపథ్యంలో ముందస్తు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు డీకే. ఇందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తూనే దిల్లీకి బయలుదేరి వెళ్లిన డీకే... తొలుత కర్ణాటక భవన్‌కు, ఆ తర్వాత తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నివాసానికి వెళ్లి అక్కడినుంచి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇదీ కేసు
గతేడాది ఐటీ శాఖ జరిపిన దాడుల్లో హవాలా రూపంలో భారీగా నగదు బదిలీ జరిగినట్లు తేలింది. ఇందులో ముగ్గురు నిందితుల వాగ్మూలం ప్రకారం ఛార్జిషీటులో శివకుమార్‌ను ఏ-1గా చేర్చింది ఈడీ.
ఇదీ చూడండి: అసోం ఎన్ఆర్సీ: 71ఏళ్ల వివాదానికి నేడే తెర!